ఆదర్శంగా వుండాల్సిన తల్లిదండ్రులు ప్రస్తుతం కన్నబిడ్డల పాలిట శాపంగా మారుతున్నారు. తాజాగా తల్లిదండ్రుల మద్యం మత్తు వారి చిన్నారి మరణానికి కారణమైంది. వివరాల్లోకి వెళితే.. సైదాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోనీ పూసలబస్తీలో నివసించే రాజేశ్, జాహ్నవి దంపతులు నిత్యం మద్యం సేవించి గొడవపడేవారు. శుక్రవారం కూడా ఇరువురు గొడవపడ్డారు. కోపోద్రిక్తుడైన రాజేశ్.. జాహ్నవి మీద దాడి చేశాడు.
భర్త దెబ్బలు తాలలేక.. జాహ్నవి తన చేతిలోని 21 రోజుల బాబును అడ్డుపెట్టింది. దాంతో చిన్నారికి బలంగా దెబ్బ తగిలింది. చిన్నారిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. స్థానికుల సమాచారంతో సైదాబాద్ పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకొని పసికందు తల్లిదండ్రులను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు.