ఖమ్మం జిల్లాలో 7 కోట్ల విలువ చేసే నకిలీ నోట్లు స్వాధీనం
శనివారం, 2 నవంబరు 2019 (17:50 IST)
ఖమ్మం జిల్లా సత్తుపల్లి కేంద్రంగా సాగుతోన్న దొంగ నోట్ల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఆ ముఠా నుంచి భారీగా నకిలీ నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఖమ్మం నగర పోలీస్ కమిషనర్ ఇక్బాల్ మీడియాతో మాట్లాడుతూ.. రూ.7 కోట్ల విలువ చేసే నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. అమాయకులకు డబ్బు ఆశ చూపి మోసం చేస్తున్నారన్నారు. ఈ ముఠాను నమ్మి చాలా మంది మోసపోయారని సీపీ చెప్పారు.
ఈ ముఠా తెలంగాణ, ఏపీ, తమిళనాడులోనూ మోసాలకు పాల్పడిందని ఆయన వెల్లడించారు. ఈ ముఠాలో ఐదుగురిని అరెస్టు చేశామనీ.. మరో ఎనిమిది మంది పరారీలో ఉన్నట్టు తెలిపారు.
నిందితుల నుంచి నగదుతో పాటు రెండు కార్లను స్వాధీనం చేసుకున్నట్టు సీపీ వెల్లడించారు. ఈ ముఠా కీలక సూత్రధారి పాత నేరస్థుడైన మదార్ మియాగా గుర్తించామని తెలిపారు. సులభంగా డబ్బు సంపాదించాలనుకునే వాళ్లకు వల వేసి మోసం చేసేవారన్నారు.
పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామనీ.. అరెస్టు చేసిన వారిని రిమాండ్‌కు తరలిస్తామని చెప్పారు. నిందితులను పోలీస్ కస్టడీకి తీసుకొని ఇంకా ఎవరెవరిని మోసం చేశారు? ఎంత మేర మోసం చేశారో విచారించనున్నట్టు ఆయన వెల్లడించారు.
ఈ ముఠా చేతిలో మోసపోయినవారు ఎవరైనా తమ వద్దకు వస్తే న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని సీపీ విజ్ఞప్తి చేశారు. ఈ నకిలీ నోట్ల ముఠా గుట్టును రట్టు చేసిన పోలీసు సిబ్బందికి సీపీ అభినందనలు తెలిపారు.