ఆర్టీసి సమ్మె, కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించా, కానీ: పవన్ కళ్యాణ్

శుక్రవారం, 1 నవంబరు 2019 (20:52 IST)
తెలంగాణ ఆర్టీసి కార్మికులు చేస్తున్న సమ్మె నెల రోజులు దాటిపోయింది. ప్రభుత్వానికి - ఆర్టీసి కార్మికలకు మధ్య ప్రతిష్టంభన సాగుతోంది. ఈ నేపధ్యంలో ఇటీవల కార్మిక సంఘాల నాయకులు పవన్ కల్యాణ్ ను కలిసి తమ గోడును వివరించారు. సీఎం కేసీఆర్ తో కలిసి సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తానంటూ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 
 
ఈరోజు ట్విట్టర్లో స్పందిస్తూ... తెలంగాణ ఆర్టీసి సమ్మె విషయమై మాట్లాడటానికి సీఎం శ్రీ. కె. చంద్రశేఖర రావుగారు కానీ, పెద్దలు శ్రీ కె. కేశవరావుగారు కానీ, మంత్రులు శ్రీ కె.టి. రామారావు, ఇతరులు సుముఖంగా వున్నట్లు కనిపించడంలేదు. గురువారం నాడు ఆర్టీసి కార్మిక సంఘాల నేతలు హైదరాబాదులోని జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చి నన్ను కలిశారు. సమ్మె సందర్భంగా ప్రభుత్వంతో ప్రారంభించిన చర్చలు పీటముడిగా మారిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 
 
గత 30 రోజులుగా సమ్మెలో వున్నా ప్రభుత్వం వైపు నుంచి సరైన స్పందన కనబటంలేదని బాధను వ్యక్తం చేశారు. సమ్మె సమస్య పరిష్కారంలో జోక్యం చేసుకోవాలని కోరారు. దాంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, శ్రీ కేశవరావుగారిని, కొందరు మంత్రులను కలవడానికి సమయం కోసం జనసేన పార్టీ ప్రతినిధులు ప్రయత్నం చేశారు. ఐతే దీనిపై మాట్లాడేందుకు వారు ఎవరూ ఎందుకోగానీ సంసిద్ధంగా లేరు. అందువల్ల వారిని కలవలేకపోయాను. 
 
3వ తేదీన విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ నిర్వహణలో భాగంగా నేను ఆ కార్యక్రమానికి వెళ్లాల్సి రావడంతో కేసీఆర్ గారిని కలిసే ప్రయత్నాన్ని విశాఖ నుంచి వచ్చిన తర్వాత మరోసారి చేస్తాను. ఆర్టీసి కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు ఈ సమస్య పరిష్కారం అయ్యేవరకూ అండగా వుంటాను" అని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు