హైదరాబాద్ హిమాయత్ నగర్ అది. రాజేష్, సారికలు భార్యాభర్తలు. వీరికి పెళ్ళై ఆరునెలలు అవుతోంది. రాజేష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, సారిక ఒక పెళ్ళి పందిరి కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోంది. ఇద్దరికీ ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవు. ప్రశాంతమైన జీవితం. కొత్తగా పెళ్ళవ్వడంతో చెట్టాపట్టాలేసుకుని తిరిగేవారు. వారం మొత్తం కష్టపడినా ఒక్క ఆదివారం మాత్రం బాగా ఎంజాయ్ చేసేవారు.
భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు ఉండేవి కావు. అయితే ఉన్నట్లుండి సారిక భర్తను దూరం పెడుతూ వచ్చింది. అది కూడా నెలరోజుల నుంచే. అందుకు కారణం వివాహేతర సంబంధం. పెళ్ళి పందిరి కంపెనీలో తనతో పాటు పనిచేసే సూర్యనారాయణతో సారిక వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో ఎక్కువ వర్క్ ఉందంటూ భర్తకు ఏదో ఒకటి చెప్పి రాత్రి 9 గంటల తరువాత ఇంటికి వెళ్ళేది. భర్తను దూరంగా పెట్టేది.
సారిక వ్యవహారంపై అనుమానం వచ్చిన రాజేష్ విషయంపై దృష్టి సారించాడు. దాంతో సారిక మరో యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలుసుకుని కుంగిపోయాడు. భార్యను ఏమీ అనలేక మద్యానికి బానిసయ్యాడు. ప్రతిరోజు ఇంటికి మద్యం తాగి వచ్చేవాడు. అయితే తన అక్రమ సంబంధం కొనసాగించాలంటే భర్తను ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకుంది సారిక.
భర్తకు ఇష్టమైన చికెన్ పులుసు ఇంట్లో చేసింది. ఆ పులుసులో విషాన్ని కలిపింది. అది తెలియని రాజేష్ తినేశాడు. కొద్దిసేపటికి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి చనిపోయాడు. తన భర్త చనిపోయాడన్న రాజేష్ తమ్ముడు నరేష్‌కు చెప్పింది సారిక. సారికపై అనుమానం వచ్చిన నరేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోస్టుమార్టం రిపోర్ట్‌లో అన్నీ బయటపడ్డాయి. దీంతో సారికతో పాటు ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు.