సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు క్యూకట్టిన ప్రయాణికులు

సోమవారం, 1 జూన్ 2020 (15:28 IST)
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ప్రయాణికులు క్యూ కట్టారు. లాక్డౌన్ ఆంక్షల సడలింపుతో దేశ వ్యాప్తంగా 200 రైలు సర్వీసులను నడిపేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేసింది. ఇందులోభాగంగా, తెలుగు రాష్ట్రాల నుంచి 9 రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. 
 
జూన్ ఒకటో తేదీ సోమవారం ఉదయం ఆరు గంటలకు నాంపల్లి నుంచి తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఢిల్లీకి బయలుదేరింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు చేరుకోవడంతో భారీ క్యూలైన్‌ ఏర్పడింది. 
 
ప్రయాణికులంతా రైలు బయలుదేరే సమయానికి 90-120 నిమిషాల ముందే రావాలని సూచించడంతో పెద్దసంఖ్యలో ప్రయాణికులు తెల్లవారుజాము నుంచే రైల్వే స్టేషన్‌కి చేరుకున్నారు. వారంతా సామాజిక భౌతికదూరం పాటిస్తూ వరుస లైన్లలో నిల్చొన్నారు. వీరందరికీ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత రైలు ఎక్కేందుకు అనుమతినిచ్చారు.
 
కాగా, దేశవ్యాప్తంగా 100 రూట్లలో 200 ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడుపుతుంది. తొలి రోజు లక్షా 45 వేల మంది ప్రయాణాలు చేయనున్నారు. ఆన్‌లైన్, రైల్వే బుకింగ్ కౌంటర్లలో రిజర్వేషన్‌కు అవకాశం కల్పించారు. థర్మల్ స్క్రీనింగ్ తర్వాత టికెట్ ఉన్న వారికే స్టేషన్‌లోకి అనుమతిస్తారు. ప్రతి ప్రయాణికుడు తప్పని సరిగా మాస్క్ ధరించాలని నిబంధన విధించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు