ఓటుకు నోటు కేసులో మరో ఎఫ్‌ఐఆర్‌ అక్కర్లేదు: హైకోర్టు స్పష్టీకరణ

గురువారం, 1 సెప్టెంబరు 2016 (10:02 IST)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో మరో ఎఫ్‌ఐఆర్‌ అవసరం లేదని, ఈ కేసులో విచారణ ఇంకా కొనసాగుతోందని ఏసీబీ ప్రత్యేక కోర్టుకు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) తెలిపింది. ఈ మేరకు బుధవారం మెమో దాఖలు చేసింది. 
 
ఈ కేసులో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు పేరును చేర్చాలంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ప్రైవేట్ పిటిషనపై విచారణ అనంతరం.. కేసును పునర్విచారించాలని ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. 
 
కాగా, విచారణ ఇంకా కొనసాగుతోందని, కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ వ్యక్తిగతంగా విచారిస్తున్నామని, ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించాల్సి ఉందని కోర్టుకు సమర్పించిన మెమోలో ఏసీబీ పేర్కొంది. దర్యాప్తు ముగిసిన వెంటనే సప్లిమెంటరీ చార్జిషీట్‌ సమర్పిస్తామని తెలిపింది.
 
మరోవైపు ఓటుకు నోటు కేసులో పునర్విచారణకు ఆదేశించిన నేపథ్యంలో.. ఈ నెల 29న కోర్టులో హాజరు కావాలంటూ టీటీడీపీ ఎమ్మెల్యే రేవంతరెడ్డి, సెబాస్టియన, ఉదయసింహలకు ఏసీబీ ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. 

వెబ్దునియా పై చదవండి