దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబుల కాంబినేషన్లో రూపొందున్న ఎస్ఎస్ఎంబీ29 చిత్రం బడ్జెట్ రూ.1000 కోట్లు దాటొచ్చని హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో విస్తృతంగా ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈ అంశంపై స్పందించారు. ఈ ప్రాజెక్ట్ తర్వాత ప్రపంచమంతా తెలుగు సినిమా గురించే మాట్లాడుకుంటుందని, తెలుగు సినిమా ఎవరూ ఊహించని స్థాయికి ఎదుగుతుందని అన్నారు. ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ కచ్చితంగా రూ.1000 కోట్లు దాటవచ్చని భరద్వాజ అంచనా వేశారు.
'బాహుబలి' సినిమా విడుదలయ్యాక తెలుగు సినిమా స్థాయి పెరిగిందని, రూ.100 కోట్ల సినిమా అంటే సర్వసాధారణ అంశంలా మారిపోయిందన్నారు. ఇక ఎన్టీఆర్ - రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన "ఆర్ఆర్ఆర్" తర్వాత రూ.300 కోట్లు చిన్న బడ్జెట్‌గా కనిపిస్తోందని, ప్రస్తుతం మహేశ్ సినిమా వచ్చాక రూ.500 కోట్లు సాధారణ విషయంలా అనిపిస్తోందని చెప్పారు.
ఇకపోతే, ఈ సినిమా కనీసం రూ.2 వేల కోట్ల బిజినెస్ జరుపుతుందని తమ్మారెడ్డి భరద్వాజ అంచనా వేశారు. వసూళ్లు రూ.3-4 వేల కోట్ల వరకు రావొచ్చని అన్నారు. ఈ సినిమాలో అంతర్జాతీయ స్థాయి నటులు నటిస్తారని పేర్కొన్నారు. భవిష్యత్తును రాజమౌళి చాలా బాగా ఊహిస్తారని, 'ఎస్ఎస్ఎంబ29' ద్వారా మరోసారి ఆయన సత్తా చాటనున్నారని అన్నారు.