తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొంది అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ప్రగతి భవన్‌ను పేరును ప్రజా పాలనా భవన్‌గా మారుస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. తెలంగాణాలో కాంగ్రెస్ విజయం ప్రజల తెలంగాణ స్వర్ణయుగానికి నాంది పలుకుతుందని చెప్పారు. తాము అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ పేరును ప్రజా పాలనా భవన్‌గా మారుస్తామని వెల్లడించారు. అపుడు ఈ భవన్ తలుపులు ప్రజలు కోసం 24 గంటల పాటు తెరిచే ఉంటాయని తెలిపారు.
ముఖ్యంగా, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను తీసుకోవడానికి 24 గంటల పాటు తెరిచి ఉంచడంతో పాటు ప్రజా సమస్య పరిష్కారం కోసం 72 గంటల్లో పరిష్కరించేందుకు వీలుగా ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ క్రమం తప్పకుండా ప్రజా దర్బార్‌లు నిర్వహిస్తామన్నారు. జవాబుదారీతనం, పారదర్శకతతో కూడిన ప్రజా తెలంగాణ కోసం తెలంగాణ ప్రజానీకం తమతో కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ ట్వీట్‌ను తెలంగాణ కాంగ్రెస్ .. "రాహుల్ గాంధీ సంచల ట్వీట్" అంటూ మరోమారు ట్వీట్ చేసింది.