తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం నుంచి జిల్లాల్లో పర్యటించనున్నారు. తొలుత సిద్ధిపేట, కామారెడ్డి జిల్లాల్లో ఆయన పర్యటిస్తారు. ఈ జిల్లాల్లో కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాలతోపాటు పోలీసు కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాలను కూడా ప్రారంభించనున్నారు.
ఆదివారం ఉదయం 11 గంటలకు సిద్దిపేటకు చేరుకొని జిల్లా కలెక్టరేట్‌తోపాటు పోలీసు కమిషనరేట్‌ను, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని సైతం ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డి సమీకృత కలెక్టరేట్‌తోపాటు ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.
ఆయా జిల్లాల్లోని గ్రామాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించే అవకాశం ఉన్నది. సోమవారం వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. కాళోజీ యూనివర్సిటీ, వరంగల్ అర్బన్ కలెక్టరేట్లను ప్రారంభిస్తారు. వరంగల్ సెంట్రల్ జైలు ప్రాంగణంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖాన భవన నిర్మాణానికి భూమి పూజచేయనున్నారు.