ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి: మంత్రి హరీష్

శనివారం, 29 ఆగస్టు 2020 (10:24 IST)
తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.
సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో  కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి హరీశ్ రావు, ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

సంగారెడ్డి నియోజకవర్గంలో నేడు 530 మంది లబ్ధిదారులకు రూ.6.14 కోట్లు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..  ప్రజల శ్రేయస్సుకోసం ప్రభుత్వం పని చేస్తుందని ,ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.

కరోనాలో ఎక్కడా సంక్షేమం ఆగకుండా తెలంగాణ ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరిస్తోందన్నారు.  ఈ సంవత్సరం ఇప్పటివరకు  జిల్లాలో 34.16 కోట్లు కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ చెక్కులను అందజేశామని తెలిపారు.
 
రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు పథకం కింద రూ.7400 కోట్ల రూపాయలు రైతులకు అందించామన్నారు. కరోనాతో వీధి వ్యాపారులకు ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని,  వారికి ఆర్థికంగా చేయూతనివ్వడానికి ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి 10 వేల రూపాయలను తక్కువ వడ్డీతో రుణాలు అందిస్తున్నామన్నారు.

జిల్లాలో  12 వేల మంది వీధి వర్తకులకు రుణం అందించడం లక్ష్యం కాగా ఇప్పటివరకు రెండు వేల మందికి అందించామని తెలిపారు. సంగారెడ్డి పురపాలికలోని 60 మంది వీధి వర్తకులకు రుణ మంజూరు ఉత్తర్వులను మంత్రి అందజేశారు. సెప్టెంబర్ నెలాఖరులోగా వీధి వ్యాపారులు అందరికీ రుణాలు అందించి ఆర్థిక చేయూత నివ్వాలని, అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా కు మంత్రి సూచించారు.
 
ప్రతి 1000 మందికి ఒక పబ్లిక్ టాయిలెట్ నిర్మించాలన్న ఉత్తర్వుల మేరకు నిర్మించిన మొదటి జిల్లా సంగారెడ్డి జిల్లా అని మంత్రి పేర్కొన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళితులకు భూమిని కొనుగోలు చేసి ఇచ్చామని,అట్టి భూమిలో మొదటి సంవత్సరం పంటకు అయ్యే పెట్టుబడి సాయం అందిస్తున్నామన్నారు.

అందులో భాగంగా  నారాయణఖేడ్ నియోజకవర్గం లో భూమి కొనుగోలు పథకం కింద లబ్ధి పొందిన 12 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ. 29 వేల చొప్పున సుమారు రూ .3.50 లక్షలు పంట సహాయం చెక్కులను అందజేశారు.

12 మంది లబ్ధిదారుల లో ఎనిమిది మంది మనూర్ మండలం ఎల్గోయి కి చెందిన వారు కాగా నలుగురు కల్హేర్ మండలం  బాచుపల్లి కి చెందిన వారు ఉన్నారని చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు 364 ఎకరాలకు 16 కోట్లు ఖర్చు చేశామని ఆయన తెలిపారు.
 
కరోనాకు భయపదాల్సిన పని లేదని, అధైర్యపడొద్దని, జాగ్రత్తగా ఉండాలని  ప్రజలకు సూచించారు. మాస్కులు లేకుండా ఎవ్వరూ బయటకు రావొద్దన్నారు. సంగారెడ్డి జిల్లాలో ఒక్క రోజే 2 వేల టెస్ట్ లు చేశామని, అవసరమైతే ప్రత్యేకంగా మొబైల్ వ్యాన్ ను గ్రామాలకు పంపి, పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. కొద్ది లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకోవాలని, పాజిటివ్ వస్తే హోమ్   ఐసోలేషన్ కి ట్స్ కూడా అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
 
జిల్లాలోని అన్నీ పీహెచ్ సీ కేంద్రాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. వ్యాధి లక్షణాలు  ఉన్నట్లయితే దగ్గరలోని పిహెచ్సి డాక్టర్ ని సంప్రదించి, టెస్ట్ లు  చేయించుకుని చికిత్స పొందాలన్నారు. వ్యాధి తీవ్రతను బట్టి జిల్లా ఆస్పత్రి, ఎం ఎన్ ఆర్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తామన్నారు. అవసరమైతే హైదరాబాద్ లోని ఇతర kovid ఆస్పత్రిలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.

వ్యాధిని దాచడం నేరమని చెప్పడంతో అందరికీ మేలు జరుగుతుందన్నారు. ప్రాథమిక దశలోనే డాక్టర్లను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని మంత్రి కోరారు. నిర్లక్ష్యంతో ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని హితవు పలికారు.
 
ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పి చైర్ పర్సన్ మంజు, జిల్లా కలెక్టర్ హనుమంతరావు,అదనపు కలెక్టర్ రాజర్షి షా, మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి, తహశీల్దార్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు