ఇండియన్ డేటింగ్ డాట్.కామ్‌లో అందమైన యువతి, పెళ్లాడుతానంటూ రూ. 21 లక్షల మోసం

శనివారం, 2 జనవరి 2021 (11:05 IST)
పెళ్లి అంటే ఇప్పుడు యువకులకు పెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా తనకు నచ్చిన అమ్మాయి జోడీగా కుదరాలంటే ఇప్పుడు తల ప్రాణం తోకకు వస్తోంది. ఈ బలహీనతనే కొంతమంది కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. తాజాగా ఇండియన్ డేటింగ్.కామ్ అనే వెబ్ సైటులో ఇద్దరు దంపతులు ఓ యువకుడిని బోల్తా కొట్టించి అతడి నుంచి రూ. 21 లక్షలు కొట్టేశారు.
 
పూర్తి వివరాల్లోకి వెళితే.. విజయవాడకు చెందిన 30 ఏళ్ల హృదయానంద్, 20 ఏళ్ల అనూష 2017లో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ హైదరాబాదులో మకాం పెట్టారు. ఐతే హృదయానంద్ అనారోగ్యం పాలయ్యాడు. అనూష మాత్రం ఓ డయాగ్నస్టిక్ సెంటరులో ఉద్యోగం చేస్తోంది. కానీ వచ్చిన డబ్బు చాలకపోవడంతో పక్కదారి పట్టారు.
 
హృదయానంద్ ఓ ఫేక్ ప్రొఫైల్ తయారుచేసి అందులో ఓ అందమైన యువతి ఫోటో పెట్టాడు. ఆ యువతి ఫోటోను చూసి నేరెడ్‌మెట్‌కు చెందిన డొనాల్డ్ రోజారియో అనే వ్యక్తి చాటింగ్ మొదలుపెట్టాడు. ఈ క్రమంలో హృదయానంద్ యువతి పేరుతో తన తల్లికి గుండె జబ్బు అనీ, ఆర్థికసాయం కావాలని కోరాడు. దాంతో డోనాల్డ్ డబ్బు పంపాడు. ఆ తర్వాత తల్లి మరణించిందనీ, తన సోదరి సర్జరీకి డబ్బు కావాలంటూ పోస్ట్ పెట్టాడు.
 
 అలా మొత్తం రూ. 21 లక్షల వరకూ గుంజేసారు. ఐతే డొనాల్డో ఇటీవల తనను పెళ్లాడాలంటూ ఒత్తిడి చేయడంతో వాయిదాలు వేస్తూ వచ్చాడు. అనుమానం వచ్చిన డొనాల్డ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను విజయవాడలో అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు