గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు పంజా విసురుతున్నాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ, రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. గత నెల రోజుల్లో తెలంగాణలో మొత్తం 1900 డెంగ్యూ కేసులు నమోదవగా.. ఒక్క హైదరాబాద్‌లోనే 450 కేసులు నమోదు కావడం ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
గతవారం రోజుల్లో హైదరాబాద్‌లో డెంగ్యూ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వర్షాకాలంలో పారిశుద్ధ్యం సరిగా లేకపోవడం వల్లే నగరంలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన వారం రోజుల్లో 40 నుంచి 50 శాతం వరకు ఈ వ్యాధులు పెరిగాయి. డెంగ్యూ దోమలు సాయంత్రం, తెల్లవారుజాము సమయాల్లో ఎక్కువ చురుగ్గా ఉంటాయి. ఆ సమయంలో వాకింగ్‌కి వెళ్లేవారు, బయట తిరిగేవారు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు కోరుతున్నారు.
అయితే, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం,నీరు నిల్వం ఉండకుండా చేయడం ద్వారా దోమలను అరికట్టవచ్చని వైద్యులు అంటున్నారు. దోమలు ఉండే ప్రదేశంలో శరీరాన్ని పూర్తిగా కప్పే దుస్తులు ధరించాలన్నారు. జ్వరం వచ్చినవారు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకుని మెడిసిన్ వాడాలన్నారు. వ్యాధిని త్వరగా గుర్తించడం ద్వారా ముప్పును తగ్గించవచ్చునని చెప్పారు.