హైదరాబాదు, రెవెన్యూ వ్యవస్థలో అవకతవకలు, అవినీతిని నిర్మూలించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ధరణీ పోర్టల్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ధరణీ పోర్టల్‌లో ఆస్తుల వివరాలు నమోదు చేయరాదని స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పోర్టల్‌లో భద్రతాపరమైన అంశాలు, ఆస్తుల నమోదుపై దాఖలైన పలు ఫిటిషన్‌ను మంగళవారం హైకోర్టు విచారించింది.
భద్రతాపరమైన నిబంధనలు పాటించకుండా వ్యవసాయేతర భూముల వివరాలు నమోదు చేయడంతో ఇబ్బందులు తలెత్తుతాయని, కావున అప్పటివరకు ఎలాంటి వివరాలను నమోదు చేయకూడదని ధర్మాసనం ప్రభుత్వానికి సూచించింది. అయితే ఇప్పటివరకు సేకరించిన వివరాలన్ని థర్డ్ పార్టీకి ఇవ్వద్దని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశించింది.
కొత్త రెవెన్యూ చట్టం కేవలం రైతు సాగు భూముల కోసమేనని తెలిపింది. అయితే ఏ చట్టం ఆధారంగా ఆధార్, కులం వివరాలను సేకరిస్తున్నారని ప్రశ్నించింది. వ్యవసాయేతర ఆస్తుల వివరాల కోసం ఎలాంటి డేటాను భద్రతాపరంగా తీసుకుంటున్నారో తెలపాలని కోరింది. ఈ మేరకు రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.