ప్రయివేటు దవాఖానకు పోయి డబ్బులు వృథా చేసుకోవద్దు: మంత్రి హరీశ్ రావు

సోమవారం, 28 సెప్టెంబరు 2020 (13:14 IST)
కరోనా వ్యాధి తీవ్రత ఉంటే వెంటనే సిద్ధిపేట కోవిడ్ ఆసుపత్రికి రావాలని, ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు వైద్య బృందం, నర్సులు, స్టాఫ్ సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుంటున్న సక్సెస్ రేట్ 99.4 శాతం చాలా ఎక్కువగా ఉన్నదని, 0.6 శాతం మాత్రమే మృత్యువాత పడుతున్నారని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సిద్ధిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకును సోమవారం ఉదయం మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ తమిళ్ అరసుతో కలిసి మంత్రి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కరోనా నేపథ్యంలో ఆక్సిజన్ అవసరాలు పెరిగాయని, హైదరాబాదు నుంచి సిద్ధిపేటకు రావాలంటే.. వైద్య సిబ్బంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గమనించి., గతంలో ఆక్సిజన్ సిలిండర్లతో యాక్సిడెంట్-ప్రమాదాలు జరిగిన సందర్భాలు దృష్టిలో పెట్టుకుని శాశ్వత ప్రాతిపదికన సిద్ధిపేట మెడికల్ కళాశాలకు లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకును తెప్పించినట్లు పేర్కొన్నారు. 
 
24/7 ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 405 బెడ్స్ కోసం పని చేసేలా రూ.61 లక్షల వ్యయంతో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకును తెప్పించినట్లు మంత్రి తెలిపారు. మెడికల్ కళాశాలలోని ఐసీయూలో 45 పడకలు, జనరల్ వార్డుల్లో 360 పడకలలో కరోనా నేపథ్యంలో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకు ద్వారా ఆక్సిజన్ సప్లయ్ చేయనున్నట్లు చెప్పారు. 
 
ప్రజలు అనవసరంగా ప్రయివేటు దవాఖానకు పోయి తమ వేల, లక్షలాది రూపాయలు వృథా చేసుకోవద్దని మంత్రి కోరారు. సిద్ధిపేటలో వంద పడకల కోవిడ్ ఆసుపత్రి ఉన్నదని మంచి డాక్టర్లు ఉన్నారని, అవసరమైన అన్నీ మందులు అందుబాటులో ఉన్నాయని, ఆక్సిజన్ సప్లయ్ సమస్య ఇవాల్టితో శాశ్వతంగా పరిష్కారమైందని తెలిపారు.

కరోనా వ్యాధి తీవ్రత ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని, ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు వైద్య బృందం, నర్సులు, స్టాఫ్ సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. మాకేమీ కాదులే.. అనుకుని ట్రీట్మెంట్ తీసుకోకుండా వారం, 10 రోజులు నిర్లక్ష్యం చేయడంతో ఇతర ఆర్గాన్స్ పై ప్రభావం పడి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజలకు హితవు చెప్పారు. 

కరోనా అంటే భయపడాల్సిన అవసరం లేదని, నిర్లక్ష్యంగా ఉండొద్దని, ఆలస్యం చేయొద్దని ప్రజలను కోరారు. ప్రతి పీహెచ్ సీ ద్వారా జిల్లా ఆసుపత్రిలో, ప్రతీ మండల కేంద్రంలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు, కరోనా పాజిటివ్ అని తెలగానే వ్యాధి తీవ్రతను బట్టి హోమ్ ఐసోలేషన్, ఆసుపత్రిలో అడ్మిషన్ చేయడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.

పరీక్షలు కూడా జిల్లాలోని ప్రతీ పీహెచ్ సీ, ప్రతి ఆసుపత్రి, మండల కేంద్రాల్లో కోవిడ్ టెస్టులు చేస్తున్నట్లు, పరీక్షలకు లిమిట్ లేదని ఎంత మంది వస్తే ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రి డాక్టర్లు పరీక్షలు చేస్తారని తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారికి వైద్య బృందం టచ్ లో ఉండి అవసరమైన ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. 

కరోనా పరీక్షలు కూడా చేసిన వెంట వెంటనే రిజల్ట్స్ ఇస్తున్న దరిమిలా అవసరమైన ట్రీట్మెంట్ తీసుకుని ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలు వినియోగించుకోవాలని మంత్రి ప్రజలను కోరారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఏఏంసీ చైర్మన్ పాల సాయిరాం, సుడా డైరెక్టర్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి, ఆసుపత్రి సూపరిండెంట్ చంద్రయ్య, మెడికల్ కళాశాల ఆర్ఏంఓ కాశీనాథ్, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు