ఆదివారం సాయంత్రం 6.48 గంటల సమయంలో మంచిర్యాల, కొమురంభీం, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భూ ప్రకంపనలు కనిపించాయి. మూడు నుంచి 5 సెకన్లపాటు భూమి కంపించింది. జగిత్యాల పట్టణంలోని రహమత్‌పురా, ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూరు, సలుగుపల్లి గ్రామాల్లో భూమి కంపించగా, మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ప్రకంపనలు కనిపించడం గమనార్హం.
పెద్దపల్లి జిల్లా ముత్తారం, రామగుండం మండలాల్లోనూ భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మెగుళ్లపల్లితోపాటు రంగాపురంలో రాత్రి 7 గంటల సమయంలో మూడు సెకన్ల పాటు ప్రకంపనలు కనిపించింది.
అలాగే, మల్హర్ మండలం కుంభపల్లి, దుగ్గొండి మండలంలోని రేకంపల్లి, కొత్తపల్లి (బి), మానేరు పరీవాహక ప్రాంతంలో రాత్రి ఏడున్నర గంటల సమయంలో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. అయితే, ఈ భూప్రకంపనల్లో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లక పోవడంతో అధికారులు, భూకంప బాధిత జిల్లాల ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.