తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి నవంబరు నెలాఖరులో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల షెడ్యూల్‌కు భారత ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది. దీంతో ఎన్నికల నియమావళి కూడా అమల్లోకి వచ్చింది. ఫలితంగా హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు, అధికారులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు.
ఈ తనిఖీల్లో బయటపడుతున్న నగదు, నగలకు సంబంధించి సరైన పత్రాలు చూపించని నగదును, బంగారాన్ని, వెండిని స్వాధీనం చేసుకున్నారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తారానగర్‌లో పోలీసులు 5.65 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
నిజాం కాలేజీ సమీపంలో గేట్ నెంబర్ 1 వద్ద 7 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్కడే 300 కిలోల వెండిని కూడా పోలీసులు సీజ్ చేశారు. ఫిల్మ్ నగర్ పరిధిలోని నారాయణమ్మ కాలేజీ సమీపంలో ఓ కారులో ఎలాంటి రసీదు లేని రూ.30 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఇతర ప్రాంతాల్లోను పెద్ద మొత్తంలో నగదు, బంగారం, అక్రమ మద్యం వంటి వాటిని పట్టుకున్నారు.