ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగ్గురు ముఖ్యమంత్రుల కేబినెట్‌లో మంత్రిగా పని చేసిన సీనియర్ మహిళా రాజకీయ నాయకులు సునీతా లక్ష్మారెడ్డి జాక్‌పాట్ కొట్టారు. తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సర్కారు ఉత్తర్వులు జారీచేసింది.
అలాగే, మహిళా కమిషన్‌కు ఆమెతో పాటు మరో ఆరుగురు సభ్యులను నియమిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కమిషన్‌లో సునీతతో పాటు కుమ్రు ఈశ్వరీ బాయి, సుధం లక్ష్మి, కటారి రేవతీరావు, షహీనా అఫ్రోజ్, ఉమాదేవి యాదవ్, గద్దల పద్మ తదితరులు సభ్యులుగా ఉంటారు. వీరంతా ఐదేళ్ళపాటు తమ బాధ్యతలను నిర్వహించనున్నారు.
నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే 2013లో ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా త్రిపురాన వెంకటరత్నం ఉండేవారు. ఆ తర్వాత ఏపీ రెండు ముక్కలైన తర్వాత కూడా తెలంగాణాకు ఆమె ఛైర్‌పర్సన్‌గా కొనసాగారు. 2018 తర్వాత ఆమె పదవీకాలం ముగిసిపోగా, ఇంతవరకూ మరొకరిని ఎంపిక చేయలేదు.
కాగా, గత యేడాది జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్ పార్టీని వీడి తెరాసలో చేరారు .ఆమె సమర్ధతను గుర్తించిన కేసీఆర్, మహిళా కమిషన్ బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా సునీత మీడియాతో మాట్లాడుతూ, తనను మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా నియమించడంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.