వరద నీటిలో సిరిసిల్ల కలెక్టరేట్ - ఆఫీసులోనే చిక్కుకుపోయిన కలెక్టర్

మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (12:58 IST)
గులాబ్ తుఫాను కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ మరోసారి వరద నీటిలో చిక్కుకుంది. దీంతో కలెక్టరేట్ ఏదో వాగులో వున్నట్లు దర్శనమిస్తోంది. 
 
సోమవారం రాత్రి కురిసిన వర్షానికి సిరిసిల్ల కలెక్టరేట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో కలెక్టర్ అనురాగ్ జయంతి కలెక్టరేట్‌లోనే చిక్కుకుపోయారు. రాత్రి కలెక్టరేట్‌లోనే అనురాగ్ జయంతి బస చేశారు. 
 
మంగళవారం ఉదయం మరింత వరద నీరు వచ్చి చేరడంతో ట్రాక్టర్ సహాయంతో కలెక్టర్‌ను అధికారులు బయటకు తీసుకువచ్చారు. సిరిసిల్ల కలెక్టరేట్ వద్ద వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 
 
కలెక్టరేట్ కార్యాలయం చుట్టూ వరద నీరు చేరడంతో కలెక్టరేట్ అధికారులతో పాటు వివిధ పనుల కోసం వచ్చే ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా, గతంలోనూ కలెక్టరేట్ కార్యాయలంలోకి వరద నీరు వచ్చిన సంగతి తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు