తెలంగాణలో ఓ వైపు వర్షాలు, మరోవైపు ఎండలు..

శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (10:19 IST)
తెలంగాణలో కొత్త వాతావరణం నెలకొంటోంది. ఓ వైపు వర్షాలు, మరోవైపు ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు భగభగమంటున్నాడు. రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

ఎండవేడికి జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరోవైపు ఉన్నట్టుండి వర్షాలు పడుతున్నాయి. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన జడివాన ఉలిక్కి పడేలా చేస్తోంది. అకాల వర్షాలు రైతులకు అపార నష్టాన్ని మిగులుస్తున్నాయి.
 
రాష్ట్రంలో గురువారం(ఏప్రిల్ 29,2021) పగటి ఉష్ణోగ్రతలు 37.6 డిగ్రీల నుంచి 43.9 డిగ్రీల వరకు నమోదయ్యాయి. అత్యధికంగా జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్లలో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలపైనే నమోదైంది. గాలిలో తేమ శాతం తగ్గుతోంది. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌లో గాలిలో తేమ 16 శాతం చొప్పున, జగిత్యాలలో 17 శాతం నమోదైంది.
 
గడిచిన 24 గంటల్లో నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజిపేటలో 20.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇదిలా ఉండగా.. బుధవారం ఏర్పడిన ఉత్తర దక్షిణ ఉపరితల ఆవర్తనం గురువారం పశ్చిమ విదర్భ నుంచి ఇంటీరియర్‌ కర్ణాటక మీదుగా తమిళనాడు దాకా కొనసాగుతోంది. 
 
దీని ప్రభావంతో శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, వడగండ్లతో కూడిన ఓ మోస్తరు వర్షం కురువొచ్చని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీసే అవకాశం ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు