భాగ్యనగరిలో భారీ వర్షం.. కుతుబ్ షాహీ మసీదుపై పిడుగు... నీట మునిగిన సచివాలయం

సోమవారం, 24 జులై 2023 (22:11 IST)
హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. సోమవారం సాయంత్రం సమయంలో ఒక్కసారిగా చీకట్లు కమ్ముకొని, ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. నగర ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని మేయర్ విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూమ్ నెంబర్ 040- 21111111, 9000113667కు ఫిర్యాదు చేయాలని సూచించారు. అధికారులను అప్రమత్తం చేశారు. భారీ వర్షం నేపథ్యంలో హైదరాబాద్‌లో డీఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమైంది.
 
కొండాపూర్, మాదాపూర్, సికింద్రాబాద్, గచ్చిబౌలి, ఉప్పల్, దిల్ సుఖ్ నగర్, తార్నాక, ముషీరాబాద్, కుత్బుల్లాపూర్, బోయినపల్లి, బేగంపేట, రామ్ నగర్, హబ్సిగూడ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా హైదరాబాద్ - విజయవాడ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించింది. అబ్దుల్లాపూర్ మెట్ నుండి హైదరాబాద్ వైపు రాకపోకలు నిలిచిపోయాయి. నగరంలో ద్విచక్రవాహనదారులు వంతెనల కింద తలదాచుకున్నారు.
 
మరోవైపు, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు, డీఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని మేయర్ విజయలక్ష్మి జోనల్ కమిషనర్లకు సూచించారు. 
 
అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. నగరంలో పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచింది. కాసేపు వర్షం నిలిచినా ప్రయాణికులు తమ తమ గమ్యస్థానాలకు చేరేందుకు రోడ్లపైకి వచ్చారు. వర్షం నిలిచాక ఒకేసారి అందరు రావడం, అదేసమయంలో రోడ్లపై నీరు నిలిచి ఉండటంతో నగరంలోని పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
 
హైటెక్ సిటీ - జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు వాహనాలు నిలిచాయి. చార్మినార్ వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచింది. మూసారాంబాగ్ బ్రిడ్జిపైకి భారీగా వరద నీరు వచ్చింది. దీంతో గోల్నాక బ్రిడ్జిపై నుండి వెళ్లాలని వాహనదారులకు సూచిస్తున్నారు. ఉప్పల్, ఖైరతాబాద్, కూకట్ పల్లి, బాలానగర్, ప్రకాశ్ నగర్, ట్యాంక్ బండ్, ఐకియా సహా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది.
 
కుతుబ్ షాహీ మసీదుపై పిడుగు పడటంతో మినార్ బీటలు వారింది. సంఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. సరూర్ నగర్, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట తదితర ప్రాంతాల్లో 5 సెంటీమీటర్లు, రాజేంద్ర నగర్, అంబర్ పేటలలో 4 సెంటీమీటర్లు, గోషా మహల్‌లో 3.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గ్రేటర్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఈ భారీ వర్షానికి కొత్తగా నిర్మించిన సచివాలయం కూడా నీట మునిగింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు