హైదరాబాద్ నగరంలో మరోమారు భారీ వర్షం కురుస్తోంది. శనివారం ఉదయం నుంచి ఈ వర్షం కురుస్తుండటంతో పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ముఖ్యంగా, రాజేంద్రనగర్, అత్తాపూర్, మెహదీపట్నం, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, చైతన్యపురి ప్రాంతాల్లో వర్షం కురియడంతో, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
మరోవైపు, నగరంలో భారీ వర్షం నేపథ్యంలో అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కాగా, నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు పోటెత్తింది. దాంతో కొన్నిచోట్ల వాహనాలు నీట మునిగిన పరిస్థితి కనిపించింది.
ఇదిలావుంటే, కేరళ రాష్ట్రంలో మరోమారు కుంభవృష్టి కురుస్తుంది. దీంతో ఐదు జిల్లాలకు భారీ వర్ష హెచ్చరికను జారీచేశారు. శనివారం ఉదయం నుంచి కుండపోత వానలు కురుస్తుండడంతో కేరళ దక్షిణాది జిల్లాల్లో నదులు ఉప్పొంగుతున్నాయి.
అటు, ఎర్నాకుళం జిల్లాలో మువట్టుపుళ నది ఉగ్రరూపం దాల్చింది. నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని అధికారులు స్పష్టం చేశారు. గతంలో వరద అనుభవాలు దృష్టిలో ఉంచుకుని ప్రజలు హడలిపోతున్నారు.