తెలంగాణాలో దంచికొడుతున్న వర్షాలు - నేడు రేపు వర్షాలు

మంగళవారం, 21 జూన్ 2022 (08:58 IST)
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. అనేక ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్ జంట నగరాలతో పాటు జగిత్యాల, సంగారెడ్డి, సుల్తాన్ పూర్, కుమరం భీమ్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, భూపాల్ పల్లి, హన్మకొండ, వరంగల్, ములుగు, పాలమూరు, నిజామాబాద్, కామారెడ్డి, రంగారెడ్డి, భద్రాద్రి, కొత్తగూడెం, వికారాబాద్, సూర్యాపేట, ఆదిలాబాద్ తదితర జిల్లా మోస్తర నుంచి భారీ వర్షం కురిసింది. అలాగే, మంగళవారం కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 
 
దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు తెలంగాణ మీదుగా సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని, నైరుతి రుతుపవనాలు కూడా చురుకుగా కదులుతుండటంతో  ఈ నెల 24 వరకు చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. 
 
ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, వరంగల్‌, హనుమకొండ, జనగామ, కామారెడ్డి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక జారీచేసింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. రాగల 48 గంటల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని వివరించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు