తెలంగాణ రాష్ట్ర మంత్రిపై తేనెటీగల దాడి

మంగళవారం, 29 మార్చి 2022 (08:41 IST)
తెలంగాణ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌పై తేనెటీగల దాడి జరిగింది. యాదాద్రిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రారంభోత్సవంలో ఆయన సతీసమేతంగా పాల్గొన్నారు. 
 
అయితే, మహాకుంభ సంప్రోక్షణ సందర్భంగా ఆలయ పంచతల గోపురంపై పూజా క్రతువు నిర్వహించారు. ఈ క్రతువులో పాల్గొన్న మంత్రి పువ్వాడ తదితరులపై తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఆలయ వేదపండితులు, మంత్రి సెక్యూరిటీ సిబ్బందిని కూడా వదిలిపెట్టలేదు. 
 
అయితే, మంత్రిని తేనెటీగలు కుట్టినప్పటికీ సంప్రోక్షణ కార్యక్రమం ముగిసేంత వరకు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత చికిత్స కోసం ఆయన్ను హైదరాబాద్ నగరానికి తరలించారు. ఈ విషయాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
తనపై అనుకోని రీతిలో తేనెటీగల దాడి జరిగిందనీ, రెండు రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూసించారని తెలిపారు. పైగా, తాను క్షేమంగానే ఉన్నట్టు కార్యకర్తలు, నాయకులు ఆందోళన చెందవద్దని ఆయన కోరారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు