నా భార్య ప్రవర్తన దిగజారింది, అందుకే చచ్చిపోతున్నా: వాట్సప్ గ్రూప్‌లో షేర్ చేసి...

శనివారం, 12 సెప్టెంబరు 2020 (13:44 IST)
కుటుంబ కలహాల కారణంగా ఓ ఆటోడ్రైవర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... గండిపేట్ మండలం హైదర్షాకోట్ గ్రామం శాంతినగర్ ప్రాంతానికి చెందిన ప్రసాద్ వయసు 43.
 
గత 15 సంవత్సరాలుగా నగరంలోని వివిధ ప్రాంతాలలో సెక్యూరిటీ గార్డ్స్ ఇంచార్జిగా పని చేశాడు. మూడేళ్లుగా ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య శ్రీలత రంగారెడ్డి జిల్లా గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తుంది. మోహిత్, యసెష్‌లు కుమారులు. మూడేళ్ల నుంచి భార్య ప్రవర్తన మరింత దిగజారిందని కుటుంబ సభ్యులతో చెప్పుకొని బాధపడ్డట్లు బంధువులు తెలిపారు.
 
భార్య ప్రవర్తన మార్చుకునేందుకు పలు రకాలుగా ప్రయత్నించినా మార్పు రాలేదు. దీంతో విసుగు చెంది మనస్థాపం చెందాడు. ఉదయం తన భార్య ఉద్యోగం నిమిత్తం వెళ్లిపోయిన తర్వాత తల్లి కుమారులను తన తమ్ముడు ప్రభాకర్ ఇంటికి పంపించాడు. అందరినీ పంపించి తన భార్యతో తను పడుతున్న బాధలు మొబైల్లో టైప్ చేసి ఫ్యామిలీ వాట్సప్ గ్రూప్‌లో, స్నేహితులకు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో మెసేజ్ పంపి అందులో తను ఆత్మహత్య చేసుకుంటానని పెట్టాడు.
 
అది చూసిన సోదరులు ప్రభాకర్ తన స్నేహితులతో కలిసి ప్రసాద్ ఇంటికి వచ్చాడు. తలుపులు మూసి ఉన్నాయి. కిటికీలోంచి చూడగా ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న నార్సింగి ఎస్సై అన్వేష్ రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు