నేటి నుంచి తెలంగాణాలో ఆషాఢమాసం బోనాలు : కేసీఆస్ విషెస్
ఆదివారం, 11 జులై 2021 (09:39 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఆషాఢ మాసం బోనాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం గోల్కొండ దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో హైదరాబాద్‌లో బోనాలు వేడుకలు మొదలవుతాయి.
రాష్ట్రంలో బోనాలు తొలిసారిగా గోల్కొండ జగదాంబ అమ్మవారి ఆలయంలోనే ప్రారంభంకావడం ఆనవాయితీగా వస్తోంది. గోల్కొండ బోనాలు ముగిసిన వారం తర్వాత లష్కర్ బోనాలు మొదలవుతాయి.
ఆదివారం నుంచి ప్రారంభమయ్యే బోనాల సందడి వచ్చే నెల 8 వరకు కొనసాగుతుంది. ప్రతి గురువారం, ఆదివారం బోనాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో భాగంగా లంగర్ హౌస్ నుంచి తొట్టెల ఊరేగింపు జరగనుంది.
ఈ వేడుకల్లో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ బగ్గీపై ఊరిగింపుగా వచ్చి… అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా జగదాంబ అమ్మవారికి తొమ్మిది రకాల ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
కాగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు వీలుగా గోల్కొండ బోనాల సందర్భంగా పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశారు. సుమారు 600 మందికిపైగా పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించనున్నారు. దర్శనం కోసం వచ్చే భక్తులు విధిగా కరోనా నిబంధనలు పాటించాలని కోరారు.
ఇదిలావుంటే, బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. బోనాల ఉత్సవాలు తెలంగాణ సబ్బండ వర్ణాల గంగా జమునా తెహజీబ్ (సంస్కృతి)కు ప్రతీకగా నిలుస్తాయని అభివర్ణించారు.
అమ్మవారి దీవెనతో, ప్రభుత్వ పట్టుదలతో తెలంగాణ రాష్ట్రం దేశానికే భోజనం పెట్టే అన్నపూర్ణగా మారిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవించేలా అమ్మవారి ఆశీస్సులు కలకాలం కొనసాగాలని ఆయన ప్రార్థించారు.