త్వరలో హైదరాబాద్‌లో సిటీ బస్సులు - స్టాండింగ్ జర్నీకి స్వస్తి!

శుక్రవారం, 8 మే 2020 (10:45 IST)
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేస్తోంది. అయితే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ లాక్డౌన్‌ను మరింత పటిష్టంగా అమలు చేస్తోది. ఈ క్రమంలో ఈ నెల 29వ తేదీ వరకు పొడగించింది. 
 
అయితే, 29వ తేదీ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రజా రవాణాను పునరుద్ధరించాలన్న ఆలోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా, హైదరాబాద్ నగరంలో సిటీ బస్సులను నడుపనుంది. అదీకూడా ఓన్లీ సీటింగ్ కెపాసిటీతో నడపాలని భావిస్తున్నారు. 
 
కాగా, ఈ లాక్డౌన్ కారణంగా హైదరాబాద్ నగరంలో పూర్తిగా ప్రజా రవాణాను నిలిపివేసిన విషయం తెల్సిందే. ముఖ్యంగా, మెట్రో రైలు రూ.100 కోట్లు, ఆర్టీసీ రూ.120 కోట్ల మేర నష్టపోయాయి. 
 
మెట్రో రైలులో మూడు బోగీల్లో కలిపి 900 మంది ప్రయాణించే వీలుండగా, ఇకపై అతికొద్ది మందితోనే అంటే దాదాపు సగం మందితోనే రైళ్లను నడపాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
అలాగే, ప్రయాణికులు నిల్చునేందుకు తెలుపు రంగుతో సర్కిళ్లు ఏర్పాటు చేయాలని చెబుతున్నారు. స్టేషన్‌లోకి వచ్చే ప్రయాణికులకు శానిటైజర్లు అందజేయడంతోపాటు మాస్కులు ఉంటేనే లోపలికి అనుమతించనున్నారు. 
 
ఇక, ఆర్టీసీ బస్సుల విషయానికి వస్తే, ఇకపై స్టాండింగ్ జర్నీకి చెక్ చెప్పాలని అధికారులు నిర్ణయించినట్టు చెబుతున్నారు. అలాగే, సిటీ బస్సులకు రెండువైపులా డోర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
 
అలాగే, శానిటైజ్ చేసిన తర్వాత బస్సులను రోడ్లపైకి పంపాలని నిర్ణయించినట్టు సమాచారం. ప్రయాణికుల మధ్య భౌతిక దూరం కోసం ఇద్దరు కూర్చునే సీట్లలో ఒక్కరిని, ముగ్గురు కూర్చునే సీట్లలో ఇద్దరిని మాత్రమే అనుమతించనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు