గత కొన్ని రోజులుగా వరుణ దేవుడు హైదరాబాద్ నగరంపై పగబట్టినట్టు కనిపిస్తున్నారు. ఫలితంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో హైదరాబాద్ నగరం తడిసి ముద్దై పోతోంది. అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోతున్నాయి. ఈ వర్షాల దెబ్బకు భాగ్యనగరి వాసులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ఎడతెరిపి లేకుుండా కురుస్తున్న వర్షాల వల్ల పలు జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి.
మరోవైపు, నగర శివారులోని జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లకు వరద నీరు పోటెత్తింది. ఈ జంట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో నీటి మట్టాలు ప్రమాదకరస్థాయికి చేరుకున్నాయి. దీంతో వీటి గేట్లను ఎత్తివేసి మూసీ నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ కారణంగా మూసీ నది పరివాహక ప్రాంతాలకు చెందిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.