17 జిల్లాల్లో భారీ వర్షాలు - ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు

బుధవారం, 21 అక్టోబరు 2020 (08:55 IST)
తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగనున్నాయి. ముఖ్యంగా, బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని 17 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం అకస్మాత్తుగా భారీ వానలు (ఇంటెన్సివ్‌ స్పెల్స్‌) కురువొచ్చని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ నాగరత్న తెలిపారు. 
 
మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అదేప్రాంతంలో మంగళవారం ఉదయం 8.30 గంటలకు అల్పపీడనం ఏర్పడిందన్నారు. బుధవారానికి మరింత బలపడి తీవ్రంగా మారే అవకాశం ఉన్నదని చెప్పారు. మూడ్రోజుల్లో ఇది వాయవ్యదిశగా ప్రయాణించొచ్చన్నారు. 
 
అల్పపీడనానికి అనుబంధంగా 1.5 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తువరకు మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందన్నారు. ఈ రెండింటి ప్రభావంతో రెండ్రోజులు జీహెచ్‌ఎంసీతోపాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడుతాయని తెలిపారు. 
 
అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. వాతావరణ హెచ్చరికలపై విపత్తు నిర్వహణ శాఖ, ఇతర ప్రభుత్వశాఖలను అప్రమత్తం చేసినట్టు నాగరత్న తెలిపారు. గ్రేటర్‌లో ప్రధానంగా సాయంత్రం నుంచి రాత్రి వేళల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
 
తెలంగాణ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ (టీఎస్‌డీపీఎస్‌) గణాంకాల ప్రకారం మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో అత్యధికంగా వనపర్తి జిల్లా ఘన్‌పూర్‌లో 6.2 సెం.మీ. వర్షం కురిసింది. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాలలో 5.5 సెం.మీ., మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కీసరలో 5 సెం.మీ., రంగారెడ్డి జిల్లా మంచాలలో 4.6 సెం.మీ., నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 4.2 సెం.మీ. వర్షం కురిసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు