ఆ విషయంలో పరువు కాపాడుకున్న జూనియర్ ఎన్టీఆర్..!

బుధవారం, 12 డిశెంబరు 2018 (19:05 IST)
తెలంగాణ ఎన్నికల్లో ఆచితూచి వ్యవహరించడం ద్వారా జూనియర్‌ ఎన్‌టిఆర్‌ పరువు దక్కించుకున్నారు. ఏమాత్రం తొందరపడివున్నా అభాసుపాలయ్యేవారు. అపకీర్తిని మూటగట్టుకునేవారు. గతంలో తెలుగుదేశం పార్టీ విజయం కోసం జూనియర్‌ ఎన్‌టిఆర్‌ ఊరూరా తిరిగి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అయితే… పార్టీలో జూనియర్‌ క్రియాశీలంగా ఉంటే తన కుమారుని రాజకీయ భవిష్యత్తుకు అడ్డుగా నిలుస్తారన్న భయంతో చంద్రబాబు క్రమంగా జూనియర్‌ను పక్కనపెట్టేశారన్న వాదనలు ఆమధ్య వినిపించాయి. ఇది జూనియర్‌ తండ్రి హరిక్రిష్ణకూ మనస్తాపం కలిగించిందని కూడా చెప్పుకున్నారు.
 
ఈ నేపథ్యంలో హరిక్రిష్ణ, జూనియర్‌ ఎన్‌టిఆర్‌ తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటూవచ్చారు. బాబు ధోరణి విసిగిపోయిన హరిక్రిష్ణ…. ఒక దశలో వైసిపిలో చేరుతారన్న ప్రచారమూ జరిగింది. ఆపై బిజెపిలో చేరుతారన్న వార్తలూ వచ్చాయి. 2019 ఎన్నికలు సమీపిస్తున్న వేళ హరిక్రిష్ణ కుటుంబం మద్దతు కూడా ఉంటే మంచిదని భావించిన చంద్రబాబు… మళ్లీ హరిక్రిష్ణకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. టిటిడి ట్రస్టుబోర్డు పదవి ఆశ చూపారనే వాదన కూడా వుంది. అయినా హరిక్రిష్ణ అంగీకరించలేదని అంటారు. ఆయన త్వరలోనే రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలున్న తరుణంలో…. రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆ సందర్భంగా చంద్రబాబు…జూనియర్‌ ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే.
 
ఇదిలావుండగా… తెలంగాణ ఎన్నికల్లో హరిక్రిష్ణ కుమార్తె సుహాసినిని అనూహ్యంగా, వ్యూహాత్మకంగా బరిలోకి దించారు. సుహాసిని పోటీ చేస్తే జూనియర్‌ ఎన్‌టిఆర్‌ కూడా తెలుగుదేశం తరపున ప్రచారం చేస్తారన్న ఎత్తుగడతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు ధోరణి గురించి బాగా తెలిసిన జూనియర్‌ ఎన్‌టిఆర్‌… తన సోదరి పోటీ చేస్తున్నా ప్రచారానికి వెళ్లలేదు. సోదరి కోసం ప్రచారానికి వెళితే… తాను తెలగుదేశానికి మద్దతు ఇచ్చినట్లు అవుతుందన్న భావనతో అటువంటి నిర్ణయం తీసుకున్నారు.
 
ఎన్నికల ఫలితాలు చూసిన తరువాత… జూనియర్‌ ఎన్‌టిఆర్‌ తీసుకున్న నిర్ణయం సరైనదే అనిపిస్తోంది. కూకట్‌పల్లి నియోజకవర్గంలో సుహాసిని 42 వేలకుపైగా ఓట్లు తేడాతో ఓటమి పాలయ్యారు. జూనియర్‌ ప్రచారం చేసిన తరువాత కూడా ఇటువంటి ఫలితం వచ్చివుంటే… అది ఆయన ప్రతిష్టకు భంగకరంగా ఉండేది. సోదరి ఓడిపోయినా ఫర్వాలేదుగానీ…. కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపిన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వకూడదని ఎన్‌టిఆర్‌ తీసుకున్న గట్టి నిర్ణయం ఇప్పుడు ఆయన పరువును కాపాడిందని చెప్పాలి.
 
మొత్తంగా చూస్తే జూనియర్‌ ఎన్‌టిఆర్‌ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వరని తేలిపోయింది. అయితే… 2019 ఎన్నికల్లో ఆయన ఏ పార్టీ తరపునైనా ప్రచారం చేస్తారా… లేక ఇప్పటిలాగే మౌనంగా ఉండిపోతారా… అనేది తేలాల్సివుంది. నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్న జూనియర్‌ రాజకీయాల్లో తప్పక రాణించగలరన్నది విశ్లేషకుల అంచనా. 2019 ఆయన ఏం చేస్తారో చూడాలంటున్నారు విశ్లేషకులు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు