తెలంగాణ రాష్ట్రంలో ఏ.ఆర్. కానిస్టేబుల్ ఒకరు తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు. మృతుడు కరీంనగర్ పోలీసు కమిషనరేట్ కేంద్రంలో పనిచేస్తూ వచ్చాడు. కరీంనగర్ పోలీసు కమిషనర్ వీబీ కమలాసన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రాంనగర్‌కు చెందిన దూలం చంద్రయ్యగౌడ్ కరీంనగర్ కమిషనరేట్ కేంద్రంలో ఏఆర్ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.
శనివారం ఎస్కార్ట్ విధులకు వెళ్లాల్సి ఉండగా ఉదయం 10 గంటల సమయంలో కమిషనరేట్ కేంద్రానికి వచ్చాడు. తుపాకుల విభాగంలో తుపాకీని తీసుకొని విధులకు వెళ్లే ముందు తన ద్విచక్ర వాహనం వైపు వెళ్లి తుపాకీతో కాల్చుకోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న సీపీ కమలాసన్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
కరీంనగర్ సమీపంలోని బహుపేటకు చెందిన చంద్రయ్య నగరంలోని రాంనగర్‌లో నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఐదేళ్ళుగా తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉంటున్నాడని, హైదరాబాద్‌లో ఇటీవల వైద్యం చేయించుకున్నట్లు సీపీ చెప్పారు. సంఘటన స్థలాన్ని డీఐజీ రవివర్మ సందర్శించి విచారం వ్యక్తం చేశారు.