తెలంగాణాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర
బుధవారం, 18 ఆగస్టు 2021 (10:57 IST)
కేంద్ర పర్యాటక శాఖామంత్రి కిషన్ రెడ్డి ఈ నెల 19వ తేదీ నుంచి తెలంగాణా రాష్ట్రంలో జన ఆశీర్వాద యాత్రను చేపట్టనున్నారు. కోదాడ నుండి హైదరాబాద్ వరకు ఈ యాత్ర కొనసాగనుంది. ఆగస్టు 19 సాయంత్రం నాలుగు గంటలకు కోదాడలో జన ఆశీర్వాద యాత్ర ప్రారంభమవుతుంది.
మరుసటి రోజు 20వ తేదీన దంతాలపల్లి, తొర్రూరు, రాయపర్తి, వర్ధన్నపేట, వరంగల్ లో భద్రకాళి దర్శనం, వరంగల్, హనుమకొండ లో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి అనంతరం ఖిల్లాషాపూర్ లో సర్వాయి పాపన్న గ్రామం నుండి జనగామ, ఆలేరు, యాదగిరిగుట్ట చేరుకుంటారు.
వరంగల్‌లో ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వ్యాక్సినేషన్ సెంటర్‌ను సందర్శించి ప్రజలకు అందిస్తున్న విధానాన్ని పరిశీలిస్తారు. ఆలేరులో పద్మశ్రీ అవార్డు అందుకున్న చేనేత కళాకారులు( కార్మికులు) చింతకింది మల్లేష్ కుటుంబాన్ని పరామర్శించారు. యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో దర్శనం చేసుకున్న అనంతరం యాదగిరిగుట్టలో రాత్రి బస చేస్తారు.
21వ తేదీన ఉదయం భువనగిరిలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ అందిస్తున్న ఉచిత బియ్యం పథకం ప్రజలకు చేరుతున్నా అంశాలను రేషన్ షాప్ సందర్శించి పరిశీలిస్తారు. అనంతరం ఘట్కేసర్, ఉప్పల్ మీదుగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మీదుగా నాంపల్లి బిజెపి రాష్ట్ర కార్యాలయం చేరు కుంటారు.
అదే రోజు రాత్రి 7 గంటలకు సభ ఉంటుంది. 12 జిల్లాల మీదుగా, 7 పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా 17 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా, 324 కిలోమీటర్లు జి కిషన్ రెడ్డి నేతృత్వంలో జన ఆశీర్వాద యాత్ర జరుగుతుంది. ఈ యాత్రను తెలంగాణ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తున్నది.
ఇదిలావుంటే, కిషన్ రెడ్డి బుధ, గురువారాల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు ఏపీలో జరుగనున్న జన ఆశీర్వాద్ యాత్రలో కేంద్ర మంత్రి పాల్గొంటారు. కేబినెట్‌లో ప్రమోషన్ పొందిన కేంద్ర మంత్రుల పర్యటనల్లో భాగంగా జన ఆశీర్వాద్ యాత్ర చేపట్టారు.
ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు చిత్తూరు జిల్లా రేణిగుంటకు కిషన్ రెడ్డి రానున్నారు. తిరుపతిలో పార్టీ కార్యకర్తల స్వాగత ర్యాలీ, మీటింగ్ నిర్వహించనున్నారు. గురువారం ఉదయం శ్రీవారి దర్శనం అనంతరం తిరుపతిలో వ్యాక్సిన్ సెంటర్‌ను కేంద్రమంత్రి సందర్శించనున్నారు.
గురువారం ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో కృష్ణా జిల్లా గన్నవరంకు కిషన్ రెడ్డి రానున్నారు. దుర్గ గుడిలో అమ్మవారి దర్శనంతో పాటు పలు పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో తెలంగాణ రాష్ట్ర పర్యటనకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెళ్లనున్నారు.