ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గాన్ని బుధవారం విస్తరించారు. మొత్తం 12 మందిని తొలగించిన ఆయన. కొత్తగా 15మందికి అవకాశం ఇచ్చారు. ఈ మంత్రివర్గ విస్తరణలో మొత్తం 43 మంది ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో మోడీ మంత్రివర్గం 77కు చేరింది. వచ్చే యేడాది ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు ఈ దఫా పెద్దపీట వేశారు. అలాగే, తమిళనాడులో బీజేపీని నాలుగు స్థానాలతో గెలిపించిన ఆ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎల్.మురుగన్‌కు కూడా సహాయ మంత్రిగా చోటు కల్పించారు. ఈయన ఏ ఒక్క సభల్లో సభ్యుడు కాకపోవడం గమనార్హం. దీంతో ఈయనకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చే అవకాశం ఉంది.
ఇదిలావుంటే, బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ విస్తరణలో ప్రమోషన్ దక్కించుకున్న తెలంగాణ బీజేపీ నేత కిషన్‌రెడ్డి రికార్డుల్లోకి ఎక్కారు. సాంస్కృతిక, పర్యాటకం, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖలను ఆయనకు కేటాయించారు. ఇక తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ నుంచి కేబినెట్ హోదా దక్కించుకున్న తొలి నేతగా గుర్తింపు పొందారు.
హోంశాఖ సహాయమంత్రిగా 25 నెలల ఏడు రోజులు పనిచేసిన కిషన్‌రెడ్డి తాజా కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నరేంద్ర మోడీ తొలి విడత ప్రభుత్వంలో బండారు దత్తాత్రేయ స్వతంత్ర హోదాలో కేంద్ర కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించిన కిషన్ రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి పదవి దక్కింది.
అదే ఏడాది మే 30 నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు. అవిభాజ్య ఏపీలో తెలంగాణ ప్రాంతం నుంచి సీహెచ్ విద్యాసాగర్‌రావు, బంగారు లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ కేంద్రంలో సహాయమంత్రులుగా పనిచేశారు. తెలుగు రాష్ట్రాల బీజేపీ నుంచి చూస్తే మాత్రం వెంకయ్యనాయుడు తర్వాత కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కించుకున్నది కిషన్ రెడ్డి మాత్రమే. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కిషన్‌రెడ్డి 2019 ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా విజయం సాధించారు.
విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా ఉన్న కిషన్ రెడ్డి 1960లో రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మపురంలో రైతు కుటుంబంలో జన్మించారు. ఎంపీగా గెలిచిన తొలిసారే కేంద్ర మంత్రి పదవి పొందిన కిషన్‌రెడ్డి తన పనితీరుతో మోదీని ఆకట్టుకున్నట్టు తెలుస్తోంది. తన శాఖపై పట్టు సాధిస్తూ మోడీ, అమిత్ షా వద్ద మెప్పు పొందారు.