హైదరాబాద్ శివార్లలోని చిరుతపులి హల్‌చల్, భయాందోళనలో ప్రజలు

శనివారం, 10 అక్టోబరు 2020 (15:55 IST)
గత కొన్ని నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో చిరుతపులులు అక్కడక్కడా జనావాసంలోకి వచ్చి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగర శివార్లలోని ప్రజలను చిరుతపులి మరోసారి భయాందోళనకు గురిచేసింది. రెండు నెలల క్రితం నగర శివార్లలో దర్శనం ఇచ్చిన చిరుతపులి మరోసారి కనిపించి కలకలం రేపింది.
 
నగరంలోని రాజేంద్రనగర్ వాలంతరీ రైస్ రీసెర్చ్ సెంటర్ సమీపంలో చిరుత సంచరిస్తున్నది. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో చిరుతపులి రెండు లేగదూడలను చంపినట్లు స్థానికులు గుర్తించారు. ఈ సమాచారాన్ని స్థానికులు పోలీసులకు తెలియజేయగా వారు వెంటనే అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది ఆ ప్రాంతంలోని పులి జాడలను వెతికారు.
 
ఆ ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని స్థానికులకు సూచించారు. దీంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుండగా గత ఆగస్టులో కూడా రాజేంద్ర నగర్‌లో చిరుతపులి సంచరించింది.
 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు