దశలవారీగా సమస్యలు పరిష్కరించుకుందాం: మంత్రి హరీశ్ రావు
మంగళవారం, 25 ఫిబ్రవరి 2020 (08:40 IST)
సంగారెడ్డి మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. సంగారెడ్డి మున్సిపాలిటీ 8వ వార్డులోని నారయణ రెడ్డి కాలనీని సందర్శించారు. వీధి వీధి తిరుగుతూ... కాలనీ సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
మహిళలను చెత్త బండి వస్తూందా లేదా అని మంత్రి అడిగి తెలుసుకున్నారు. రోజు విడిచి రోజు వస్తోందని మహిళలు చెప్పడంతో మంత్రి హరీశ్ రావు...మున్సిపల్ కమిషనర్ ను పిలిచి చెత్త సేకరణ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.
కాలనీలో కరెంటు సమస్యలు ప్రస్తావించడంతో విద్యుత్ శాఖ అధికారులను పిలిచి కాలనీ వాసుల ముందే సమస్యల పరిష్కారనికి కృషి చేయాలని చెప్పారు. 12 ఇళ్ల మీది నుంచి కరెంటు వైర్లు వెళుతున్నాయని ప్రమాదకరంగా ఉందని స్థానికులు మంత్రి దృష్టికి తెచ్చారు.
ఈ సమస్య పరిష్కారించాలని సూచించారు.ఓ ఇంటి ముందు డ్రైన్లో ప్లాస్టిక్ వ్యర్థాలను చూసిన మంత్రి ఆ ఇంటి మహిళను పిలిచి ఇలా ప్లాస్టిక్ వేయద్దని, తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా ఉంచాలని, చెత్త సేకరించే వాహనం వచ్చాక ఇవ్వాలని సూచించారు.
తమకు గ్యాస్ సిలిండర్లు లేవని కొందరు మహిళలు చెప్పడంతో ఆర్డీవోను పిలిచి అర్హులైన అందరికీ సిలండర్లు వచ్చేలా చూడాలని మంత్రి హరీశ్ రావు చెప్పారు. మరి కొందరు మహిళలు రేషన్ షాపు డీలర్ రేషన్ సరిగా ఇవ్వడం లేదని మంత్రికి ఫిర్యాదు చేశారు.
తమను ఇష్టారీతిన దూషిస్తూ మాట్లాడుతున్నారని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలలో దాదాపు పది రోజుల పాటు రేషన్ సరఫరా చేయాలని ఆ సమయాన్ని తెలిపేలా బోర్డులు ఏర్పాటు చేయాలని ఎమ్మార్వోను ఆదేశించారు.
దీనిపై విచారణ జరిపించి రేషన్ ఎందుకు ఇవ్వడం లేదో చూడాలన్నారు. అనంతరం మంత్రి హరీశ్ రావు స్మశాన వాటికను పరిశీలించారు.