డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ప్రముఖుల పేర్లు.. సంభాషణలకు విదేశీ సిమ్ కార్డులు..

బుధవారం, 20 సెప్టెంబరు 2023 (10:09 IST)
హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో అనేక మంది సినీ రాజకీయ ప్రముఖుల పేర్లు వెలుగు చూస్తున్నాయి. ఇటీవల మాదాపూర్‌లోని అరెస్టయిన బాలాజీ, రాంకిశోర్, కల్హ రెడ్డి మొబైల్ డేటాను పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర నార్కోటిక్స్ బ్యూరో అధికారులు విస్తుపోయారు. ఇందులో అనేక మంది సినీ సెలెబ్రిటీల పేర్లు కూడా ఉన్నట్టు గుర్తించారు. 
 
అదేసమయంలో ఈ డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన 8 మంది నిందితుల కస్టడీ కోరుతూ అధికారులు మంగళవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భాస్కర్, మురళీ, వెంకటరత్నారెడ్డిలు ఇచ్చిన సమాచారంతో ఈ నెల 14వ తేదీన ముగ్గురు నైజీరియన్లతో సహా మాజీ ఎంపీ కుమారుడు దేవరకొండ సురేశ్ రావు, రాంచందర్, కె.సందీప్, సుశాంత్ రెడ్డి, శ్రీకర్, కృష్ణప్సాద్ అనే వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 
 
వీరి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఏడు రోజుల కస్టడీ కోరుతూ నార్కోటిక్స్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. బెంగళూరులోని నైజీరియన్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి నగరానికి తీసుకొచ్చే నిందితులు రేవ్ పార్టీలు నిర్వహించి సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించేవారని అధికారులు తెలిపారు. మత్తు పదార్థాలను ఎరగావేసి మోడళ్లు, సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూసే యువతులను రప్పించేవారని, ప్రముఖులతో పరిచయాలు పెంచుకుని సినీ నిర్మాతలుగా అవతారం ఎత్తేవారని దర్యాప్తులో వెల్లడైనట్టు వివరించారు. మరోవైపు, డ్రగ్స్ స్మగ్లర్లు మాట్లాడేందుకు విదేశీ సిమ్ కార్డులను ఉపయోగించినట్టు గుర్తించారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు