హైదరాబాద్‌లో జరిగిన ప్రేమోన్మాదం మరో అమ్మాయిని బలితీసుకుంది. అంబర్‌నగర్‌లో నివాసముంటున్న హరిప్రసాద్, రేవతి దంపతులకు అనూష, గ్రీష్మ ఇద్దరు అమ్మాయిలు. పెద్ద కూతురు అనూష నారాయణగూడలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతుండగా, ఇదే కాలనీలో ఉండే ఆరెపల్లి వెంకటేశ్ హిమాయత్‌నగర్‌లోని న్యూచైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. పక్కపక్క వీధుల్లో నివాసముండే వెంకటేష్, అనూషలు 10వ తరగతి వరకూ ఒకే ట్యూషన్లో కలిసి చదువుకున్నారు. వీరి పరిచయం ప్రేమగా మారడంతో గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
అయితే ఇద్దరికీ మనస్పర్థలు రావడంతో అనూష గత ఆర్నెళ్లుగా అతనికి దూరంగా ఉంటోంది. దీంతో వెంకటేశ్ అనూషపై కోపం పెంచుకున్నాడు. అయినా వెంకటేష్ గత నెలరోజులుగా ఆమెను ఫాలో అవుతూ కళాశాలకు వెళుతున్నాడు. మంగళవారం ఉదయం వెంకట్ ఆమెకు ఫోన్ చేసి ఓయూ వెనకాల ఉన్న పాడుబడ్డ క్వార్టర్లో కలిశాడు. వెంకట్ తన ప్రేమ గురించి చెప్పడంతో అనూష నిరాకరించింది. కోపోద్రిక్తుడైన వెంకట్ బ్లేడుతో మూడుసార్లు గొంతు కోశాడు.
తీవ్ర రక్తస్రావంతో అనూష పెద్దగా అరుస్తూ కుప్పకూలిపోయింది. అనూష అరుపులు విన్న ఇమ్రాన్, ఇజాజ్ అనే ఇద్దరు యువకులు వెళ్లి చూడగా అప్పటికే అనూష రక్తం మడుగులో పడి ఉంది. వీరిని చూసి పారిపోవడానికి యత్నించిన వెంకటేశ్‌ను పట్టుకున్నారు. స్థానికులు చితకబాది వెంకటేష్‌ను పోలీసులకు అప్పగించారు. ఆస్పత్రికి తరలిస్తుండగానే అనూష మృతి చెందింది. అనూష తండ్రి హరిప్రసాద్ బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి. ఇటీవలే విజయవాడకు బదిలీ కావడంతో, పిల్లల చదువుల నిమిత్తం కుటుంబాన్ని ఇక్కడే ఉంచి తను మాత్రం విజయవాడ వెళ్లివస్తున్నాడు.