గుంటూరు జిల్లాకు మాచర్లకు చెందిన బానోతు జగన్, దేవిక అనే దంపతులు జీవనం కోసం రెండు నెలల క్రితం హైదరాబాద్ వచ్చి ఫిల్మ్ నగర్‌లో నివశిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఇంటికి సమీపంలో ఉన్న ఓ ఆస్పత్రిలో హౌస్‌కీపింగ్ విభాగంలో జగన్ పనిచేస్తున్నాడు.
సోమవారం అర్థరాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కొద్దిసేపటికే ఇంట్లో నుంచి శబ్దాలు రావడంతో ఇంటి యజమాని అక్కడికి వచ్చి చూసేసరికి జగన్ చలనం లేకుండా పడి ఉన్నాడు. అతడిపై దేవిక కూర్చొని ఉంది. వెంటనే ఆయన బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందించాడు. వారు ఘటనా స్థలానికి చేరుకొని జగన్‌ను పరీక్షించగా అప్పటికే అతడు ప్రాణాలు విడిచాడు.
అయితే, భర్తతి ఆత్మహత్య అని నమ్మించేందుకు దేవిక ప్రయత్నించింది. సోమవారం అర్థరాత్రి వరకు తమ మధ్య గొడవ జరిగిందని, మద్యం మత్తులో ఉన్న జగన్.. బొద్దింకలు చంపే హిట్‌ను స్ప్రే చేసుకొని ఇద్దరమూ చనిపోదామంటూ ఒత్తిడి తెచ్చాడని.. తాను ఒప్పుకోకపోవడంతో అతడు హిట్ కొట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పింది.
ఆమె తీరును అనుమానించిన పోలీసులు.. గట్టిగా ప్రశ్నించగా తానే హత్య చేసినట్టు ఒప్పుకుంది. తనను కాదని పరాయి మహిళతో అక్రమ సంబంధం పెట్టుకునివున్నాడనీ, దాన్ని నిలదీయడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగిందని చెప్పింది. ఆ సమయంలో మర్మాంగంపై కాలితో తన్నడంతో చనిపోయినట్టు తెలిపారు.