తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో మంతనాలు సాగిస్తున్నారన్న అంశంపై టి.తేదేపా నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలతో సమావేశం ఎందుకయినట్లు అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించినా రేవంత్ రెడ్డి నుంచి సమాధానం రాబట్టలేకపోయారు. తన సమాధానం చంద్రబాబు నాయుడు వద్ద చెపుతానంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇదిలావుండగా తెదేపా సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
తెదేపా కేంద్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందనీ, అందువల్ల తెలంగాణలో భాజపా అనుకూల పార్టీ అయిన తెరాసతో తాము పొత్తు పెట్టుకునే అవకాశం వున్నదని అన్నారు. పైగా ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు మంచి మిత్రుడనీ, కనుక ఆ పార్టీతో కలిసి పనిచేసే అవకాశం లేకపోలేదని అన్నారు. ఐతే తను చివరి వరకూ తెలుగుదేశం పార్టీలోనే వుంటానని వెల్లడించారు. రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని అధిష్టానమే చూసుకుంటుందని అన్నారు.