మునుగోడులో ప్రచార హోరు.. నిలిచిన రాజగోపాల్ రెడ్డి ప్రచారం.. ఎందుకు?

మంగళవారం, 25 అక్టోబరు 2022 (14:34 IST)
నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ స్థానానికి వచ్చే నెల మూడో తేదీన ఉప ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం బరిలో ఉన్న అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా, అధికార తెరాస, బీజేపీ, కాంగ్రెస్, ప్రజాశాంతి పార్టీల తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారంలో నిమగ్నమైవున్నారు. అయితే, బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ప్రచారాన్ని నిలిపివేశారు. 
 
ఆయనకు ఉన్నట్టుండి జ్వరం వచ్చింది. దీంతో అస్వస్థతకు లోనుకావడంతో ఆయన తన ప్రచారాన్ని అర్థాంతరంగా ముగించారు. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మంగళవారం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు దాంతో నియోజకవర్గంలో తన ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. అయితే, ఇతర బీజేపీ నేతలు మాత్రం రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. 
 
నిజానికి మంగళవారం నియోజకవర్గంలోని నాంపల్లిలో జరిగే ప్రచారంలో రాజగోపాల్ రెడ్డి పాల్గొనాల్సివుంది. కానీ, జ్వరం కారణంగా ఆయన తన ప్రచారాన్ని వాయిదా వేసుకున్నారు. జ్వరం నుంచి కోలుకున్న తర్వాత ఆయన తిరిగి ఇక్కడ నుంచి ప్రచారం చేయనున్నారు. 
 
మరోవైపు, ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా, ఈ నెల 31వ తేదీన బీజేపీ మునుగోడులో భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఇందులో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్ననున్నారు. అయితే, ఈ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించే జాతీయ నేతల వివరాలపై పార్టీ అధికారికంగా వెల్లడించాల్సివుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు