భార్య కోసం హైదరాబాద్‌కు వచ్చిన పాకిస్థాన్ పౌరుడు... 9 నెలలుగా...

శుక్రవారం, 1 సెప్టెంబరు 2023 (08:51 IST)
ఇటీవలి కాలంలో సోషల్ మీడియా పుణ్యమాని స్త్రీపురుషుల మధ్య ప్రేమ దేశ సరిహద్దులను దాటిపోతుంది. ఇటీవల తన ప్రియుడి కోసం రాజస్థాన్ వివాహిత పాకిస్థాన్ వెళ్లిపోయింది. ఇపుడు తన ప్రియురాలి కోసం పాకిస్థాన్ పౌరుడు ఒకడు స్వదేశానికి వచ్చాడు. ఈ వ్యక్తి గత తొమ్మిది నెలలుగా హైదరాబాద్ నగరంలో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పాకిస్థాన్‌లోని ఖైబర్ పుంఖ్తుక్వా ప్రావిన్స్‌కు చెందిన ఫయాజ్ అహ్మద్(24) ఉపాధి కోసం 2018 డిసెంబరులో షార్జా వెళ్లాడు. అక్కడ ఓ వస్త్ర పరిశ్రమలో పనికి చేరాడు. హైదరాబాద్ బహదూర్ పురా ఠాణా పరిధిలోని కిషన్‌బాగ్‌కు చెందిన నేహ ఫాతిమా(29) సైతం ఉపాధి కోసం 2019లో షార్జా వెళ్లింది. అక్కడి మిలీనియం ఫ్యాషన్ పరిశ్రమలో ఉద్యోగం పొందేందుకు ఫయాజ్ సహకరించాడు. 
 
ఇది వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో షార్జాలోనే 2019లో వివాహం చేసుకున్నారు. వారికి ఒక అబ్బాయి ఉన్నాడు. ఫాతిమా ఒక్కతే గతేడాది హైదరాబాద్ వచ్చి కిషన్‌బాగ్‌లోని అసఫ్ బాబానగర్‌లో ఉంటోంది. ఫయాజ్ పాకిస్థాన్ వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే ఫాతిమా తల్లిదండ్రులు జుబేర్ షేక్, అఫ్ఘల్ బేగం... ఫయాజ్‌ను సంప్రదించారు. హైదరాబాద్ రావాలని గుర్తింపు పత్రాలు వచ్చేలా చూసుకుంటామని హామీ ఇచ్చారు.
 
వీసా, ఇతరత్రా ఎలాంటి గుర్తింపు లేకున్నా ఫయాజ్ 2022 నవంబరులో పాకిస్థాన్ నుంచి నేపాల్ వెళ్లాడు. జుబేర్ షేక్, అఫ్టల్ బేగం ఇద్దరూ నేపాల్లోని ఖాట్మండూ వెళ్లి ఫయాజ్‌ను కలిశారు. అక్కడి నుంచి సాయంతో సరిహద్దులు దాటించి భారత్‌కు తీసుకొచ్చారు. అనంతరం కిషన్ బాగ్‌‌లో అక్రమంగా ఆవాసం కల్పించారు. అతనికి ఆధార్ కార్డు ఇప్పించి స్థానికుడిలా నమ్మించేందుకు పథకం వేశారు. మాదాపూర్‌లో ఒక ఆధార్ కేంద్రానికి తీసుకెళ్లి తమ కుమారుడు మహ్మద్ గౌస్ పేరిట రిజిస్టర్ చేసేందుకు ప్రయత్నించారు. 
 
ఈ మేరకు నకిలీ జనన ధ్రువపత్రం సమర్పించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఫయాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని పాకిస్థాన్ పాప్‌పోర్టు గడువు ముగిసినట్లు తేలింది. జుబేర్, అఫ్ఘల్ బేగం ఇద్దరూ పరారీలో ఉన్నారు. నిందితుడిని కౌంటర్ ఇంటలిజెన్స్, కేంద్ర నిఘావర్గాలు విచారించాయి. ఉద్దేశపూర్వకంగా సరిహద్దులు దాటాడా.. కుట్రకోణం ఏమైనా ఉందా.. అని లోతుగా విచారిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు