దేశ రాజకీయాల్లో వందేళ్ళకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాలలో రోజు రోజుకూ వన్నె తగ్గుతోంది. గతంలో ఏ కార్యక్రమం అయినా పీసీసీలు చేపడితే, ఆ రోజు రోడ్డులన్నీ బ్లాక్ అయిపోయేవి. పార్టీ అంటే, కాంగ్రెస్ అనేలా ధూంధాంగా ర్యాలీలు తీసేవారు. కానీ, ఇపుడు పేరుకే కాంగ్రెస్ జాతీయ పార్టీ గాని, రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో పూర్తిగా నీరుగారి పోయింది.
పెట్రోలు ధర శతకం దాటి, 110 రూపాయలకు పైగా పరుగులు పెడుతుంటే, దీనిపై నిరసనకు దిగిన ప్రదేశ్ కాంగ్రెస్‌లు తలో రకంలా తయారయ్యాయి. జాతీయ నాయకులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఇక్కడ మొక్కుబడిగా ప్రదర్శనలు సాగుతున్నాయి. ఏపీలో కాంగ్రెస్ ర్యాలీలు చాలా చప్పగా ఉన్నాయి. విజయవాడలో అయితే, ర్యాలీ మొదలు పెట్టకుండానే పోలీసులు అడ్డుకున్నారు. ఉన్న కొద్దిపాటి జనంతో మనం మాత్రం ఏం చేయగలం అనుకున్నారో ఏమో... తర్వాత 15 తారీఖున చేస్తాంలే అని కాంగ్రెస్ నాయకులు చక్కాపోయారు.
అయితే, తెలంగాణాలో మాత్రం రేవంత్ రెడ్డి పీసీసీ అధికార పీఠం ఎక్కడంతో అక్కడ మాత్రం నిరసనలు మిన్నంటాయి. నిర్మల్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యక్రమాల సమన్వయకర్త మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసన ప్రదర్శన జోరుగా సాగింది. వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు, నాయకులు వీధుల్లో సందడి చేశారు. ఎన్నికల కోలాహలాన్నిమరిపించారు.
ములుగులో సైకిల్ ర్యాలీలో జిల్లా ఇంచార్జి మెట్టు సాయికుమార్, ములుగు డీసీసీ అధ్యక్షులు కుమార స్వామి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రవిచంద్ర నాయక్, రైతు కాంగ్రెస్ అద్యక్షుడు రాజేందర్ గౌడ్ ఇతర అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.