హైదరాబాద్ నగరంలో గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై నగర పోలీసులు పీడీ యాక్ట్ (ప్వివెంటివ్ డికెక్షన్ (ముందస్తు నిర్బంధం))ను ప్రయోగించారు. కేవలం రౌడీషీటర్లు, చైన్ స్నాచర్లు, సాధారణ దొంగల పంథా వంటి కేసుల్లోనే ఇలాంటి యాక్ట్‌లు ప్రయోగిస్తారు. కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లేదా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఒక ప్రజాప్రతినిధిపై పీడీ యాక్ట్ ప్రయోగించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. హైదరాబాద్ నగర పోలీసులు తీసుకున్న ఈ కఠిన చర్య ఇపుడు చర్చనీయాంశంగా మారింది.
ఈ క్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు ప్రయోగించిన పీడీ యాక్ట్ సబబేనంటూ ప్రభుత్వం కనుక ఆమోదముద్ర వేస్తే మాత్రం రాజాసింగ్‌కు ఒక యేడాది పాటు జైలుశిక్ష పడుతుంది. ఈ యాక్ట్ కింద్ అదుపులోకి తీసుకున్న వ్యక్తి పూర్తి వివరాలను ప్రభుత్వానికి పంపడం ద్వారా 12 రోజుల్లోగా ఆమోదం పొందాల్సివుంటుంది. ఆపై కేసు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన అడ్వైజరీ బోర్డుకు వెళుతుంది.
ఈ బోర్డు సదరు వ్యక్తి లేదా కుటుంబీకుల వాదనలు విని, నేర చరిత్రను పరిగణనలోకి తీసుకుని పోలీసుల నిర్ణయాన్ని సమర్థించడమో లేక లోపాలు ఉంటే తిరస్కరించడమే చేస్తుంది. ఈ చట్టం ద్వారా ఒక వ్యక్తిని కనీసం మూడు నుంచి గరిష్టంగా 12 నెలల వరకు జైల్లో నిర్బంధించవచ్చు. మరి ఎమ్మెల్యే రాజాసింగ్ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెరాస ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సివుంది.