దేశానికి తలమానికంగా ఉండే హైదరాబాద్ నగరంపై ప్రకృతి ప్రకోపించినట్టుగా ఉంది. ఇప్పటికే వరుణుది దెబ్బకు భాగ్యనగరం పూర్తిగా జలదిగ్బంధనంలో చిక్కుకుంది. ఇపుడు భూమాత ఆగ్రహించింది. ఫలితంగా వరుసగా భూప్రకంపనలు సంభవిస్తున్నాయి. ఇటీవల బోరబండ, జూబ్లీహిల్స్, రహమత్‌నగర్ ప్రాంతాల్లో పెద్ద శబ్దంతో రెండుసార్లు ఈ ప్రకంపనలు సంభవించింది. తాజాగా గచ్చిబౌలి టీఎన్‌జీఓస్ కాలనీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లలో సంభవించాయి. ఈ భూప్రకంపనలు కొన్ని క్షణాలపాటు ఉండటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ప్రాణభయంతో తమతమ ఇళ్ళ నుంచి బయటకు పరుగులు తీశారు.
అర్థరాత్రి దాటాక రూ.1.30 గంటలకు మొదలైన భూప్రకంపనలు బుధవారం తెల్లవారుజామున 4 గంటల వరకు పలుమార్లు సంభవించినట్టు స్థానికులు చెబుతున్నారు. అలాగే, బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి గంటకోసారి భారీ శబ్దాలతో భూమి కంపించినట్టు చెప్పారు. ఇక బుధవారం రాత్రి కూడా భూమిలోంచి పెద్ద శబ్దాలు రావడంతో భయంతో వణికిపోయిన కాలనీ వాసులు రోడ్లపైకి వచ్చేశారు.
మరోవైపు భారీ వర్షాలు భాగ్యనగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాలతో పాటు.. అన్ని ప్రాంతాల నీట మునిగివున్మాయి. హైదరాబాద్ - బెంగుళూరు జాతీయ రహదారి సైతం వర్షపు నీటి వరద దెబ్బకు తెగిపోయింది. వాగులు, వంకలు, నాళాలు పొంగి పొర్లుతున్నాయి. అలాగే, హైదరాబాద్ నగరంలోని పలు చెరువులకు గండ్లు పడ్డాయి. దీంతో భాగ్యనగరంలో పరిస్థితి భయానకరంగా ఉంది.