వైఎస్ షర్మిలకు షాక్..పార్టీ కీలక నేత రాజీనామా

ఆదివారం, 1 ఆగస్టు 2021 (10:48 IST)
తెలంగాణలో వైఎస్ఆర్‌టీపీ పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి ముందుకు సాగుతున్న వైఎస్ షర్మిలకు ఊహించని షాక్ తగలింది. పార్టీ పూర్తిగా ప్రజల్లోకి వెళ్లకముందే కీలక నేత ఒకరు ఆ పార్టీకి రాజీనామా చేశారు.
 
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వైఎస్ఆర్‌టీపీ ఇంఛార్జ్‌గా వ్యవహరిస్తున్న ప్రతాప్ రెడ్డి వైఎస్‌ఆర్‌టీపీకి రాజీనామా చేశారు. ఆ పార్టీ ముఖ్యనేతల్లో ఒకరైన కొండా రాఘవరెడ్డి వ్యవహారశైలికి నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు ప్రతాప్ రెడ్డి ప్రకటించారు.
 
ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ కార్యాలయానికి పంపారు. జులై 8న వైఎస్ఆర్‌టీపీ పార్టీని స్థాపించిన వైఎస్ షర్మిల వివిధ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళుతున్నారు.
 
ప్రతి మంగళవారం ఒక్కో జిల్లాలో నిరుద్యోగ దీక్ష చేపడుతున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా మారతామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక ఆ పార్టీలో ఇప్పటివరకు పేరున్న నాయకులు మాత్రం ఎవరూ చేరలేదనే చెప్పాలి.

షర్మిల పార్టీకి సంబంధించిన అన్ని విషయాలను దగ్గరుండి చూసుకుంటున్న చేవేళ్ల నేత కొండా రాఘవరెడ్డి పార్టీ ముఖ్యనేతల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి కొండా రాఘవరెడ్డి వైఖరికి నిరసనగా మరో నేత రాజీనామా చేయడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు