తన గజల్‌తో ఎంతోమందిని ఆకట్టుకున్న గజల్ శ్రీనివాస్ కటకటాల పాలయ్యారు. ఒక మహిళను లైంగికంగా వేధింపులకు గురిచేశారన్న ఆరోపణల నేపధ్యంలో శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. శ్రీనివాస్ లైంగికంగా వేధించినట్లు ఆధారాలు కూడా వున్నాయంటూ వార్తలు రావడం చర్చనీయాంశంగా మారింది. తన ఇంటివద్దే గజల్ శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేసి పంజాగుట్ట పోలీస్టేషన్‌కు తరలించారు.
హైదరాబాదులో రేడియో జాకీగా పనిచేస్తున్న ఒక మహిళతో గజల్ శ్రీనివాస్‌కు మధ్య గత కొన్ని సంవత్సరాలుగా పరిచయం ఉంది. అయితే పరిచయాన్ని ఆసరాగా చేసుకున్న గజల్ శ్రీనివాస్ ఏకంగా తనను లైంగికంగా వేధించారంటూ మహిళ ఫిర్యాదు చేశారు. అయితే గత కొన్నిరోజులుగా సైలెంట్ ఉంటూ వచ్చిన ఆ మహిళ రెండు రోజుల క్రితం హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్టేషన్‌లో శ్రీనివాస్ పైన ఫిర్యాదు చేసింది.
ఆమె సమర్పించిన ఆధారాలతో పాటు మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ జరిపారు. ఆమె చెప్పిన వివరాలతో సరిపోలడంతో గజల్ శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు. గజల్ శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేయడంతో తెలుగు సినీపరిశ్రమలోని ప్రముఖులు ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు శ్రీనివాస్ పైన ఫిర్యాదు చేసిన మహిళ మానసిక స్థితి సరిగా లేదంటూ మరో మహిళ ఆరోపిస్తోంది.