తండ్రి వేధింపులు భరించలేక ఐదుగురు కుటుంబ సభ్యులను చంపేసిన యజమాని

బుధవారం, 26 జులై 2017 (17:01 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. తండ్రి షేక్‌పెంటూ షాహెబ్ వేధింపులు భరించలేక ఓ కుటుంబ యజమాని తన కుటుంబంలోని ఐదుగురు సభ్యులను జలాశయంలో తోసేసి జలసమాధి చేశాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్ల చెరువు గ్రామానికి చెందిన ఆరుగురు కుటుంబ సభ్యులైన షేక్‌పెంటూ షాహేబ్‌ (50), షేక్‌ మహాబూబీ (45), వీరి కుమారుడు షేక్‌సలీం (32), ఆయన భార్య రజియా (28), వీరిద్దరి పిల్లలు షానాజ్‌ బేగం (8), నస్రీనా(4)లు ఉన్నారు. వీరంతా బుధవారం తెల్లవారుజామున పాలేరు కాలువలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. 
 
అయితే, ఈ విషాద ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. షేక్ సలీం కుటుంబ సభ్యులను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. తండ్రి షేక్‌పెంటూ షాహెబ్ వేధింపులు భరించలేక షేక్ సలీం ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
 
దీనిపై సలీమ్‌ చిన్ననాన్న కొడుకు షేక్‌లాల్‌ మాట్లాడుతూ తమ కుటుంబానికి ఎవరో చేతబడి చేశారనీ, పాలేరు జలాశయం వద్ద పూజలు చేస్తే బాగవుతుందని నమ్మించాడు. దీంతో తామంతా అర్థరాత్రి జలాశయం వద్దకు వెళ్లాం. అక్కడకు వెళ్లాక.. ఇంట్లో టీవీ వద్ద పూజకు సంబంధించిన పసుపు, కుంకుమ, నిమ్మకాయలు మరిచిపోయానని సలీమ్‌ చెప్పడంతో వాటిని తీసుకురావడానికి తనను ఇంటికి పంపించాడని తెలిపారు. 
 
సలీమ్‌ చెప్పిన చోట చూడగా కేవలం ఒక లేఖ దొరికిందనీ, తాను తిరిగి పాలేరు కాలువ వద్దకు వచ్చి చూసేసరికి కుటుంబ సభ్యులు ఎవరూ కనిపించలేదు. దాంతో అనుమానం వచ్చి కాలువలో చూడగా మృతదేహాలు తేలుతూ కనిపించాయని బోరున విలపిస్తూ చెప్పాడు. 

వెబ్దునియా పై చదవండి