స్మైల్ ప్లీజ్.. పులిని ఫోటోకు ఫోజివ్వమన్న యువకుడు, ఎక్కడ?

బుధవారం, 2 జూన్ 2021 (11:38 IST)
సాధారణంగా పులిని చూస్తే భయంతో పారిపోతాం. ప్రాణాలను దక్కించుకునేందుకే ప్రయత్నిస్తూ ఉంటాం. అది సాధారణమే. అయితే తెలంగాణా రాష్ట్రంలో ఒక యువకుడు రెండు పులులు కనిపిస్తే ఏకంగా వాటిని ఫోటోలు తీస్తూ స్మైల్ ప్లీజ్ అంటూ పులులనే ఫోజిలివ్వమన్నాడు. 
 
నిన్న ఆదిలాబాద్ లోని రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా నుంచి రెండు పెద్దపులులు రోడ్లపైకి వచ్చేశాయి. దట్టమైన అటవీ ప్రాంతం నుంచి ఆదిలాబాద్ - ఒరిస్సా జాతీయ రహదారిపైకి వచ్చేశాయి. అయితే అటువైపుగా వెళుతున్న వాహనదారులు వాహనాలను ఎక్కడికక్కడే నిలిపివేశారు.
 
పులులు మెల్లగా రోడ్లపైనే నడుచుకుంటూ వెళుతున్నాయి. అయితే ఒక యువకుడు పులులకు దగ్గరగానే ఉంటూ వాటిని తన సెల్ ఫోన్‌లో బంధించాడు. బాగా దగ్గరికి వచ్చిన పులిని స్మైల్ ప్లీజ్ అంటూ ఫోటోలకు ఫోజులు ఇమ్మన్నాడు. యువకుడికి ఆ పులులు దగ్గరగా రావడం చూసిన అక్కడి వారంతా  భయభ్రాంతులకు గురయ్యారు.
 
సుమారు 20 నిమిషాల పాటు రోడ్డుపైనే రెండు పులులు ఉన్నాయి. అయితే ఎవరిపైనా పులులు అటాక్ చేయలేదు. ఆ తరువాత దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయాయి. ఎండాకాలం కావడంతో తాగడానికి నీరు లేకుండా సరైన ఆహారం దొరక్క పులులు రోడ్లపైకి వచ్చి ఉంటాయని అటవీశాఖాధికారులు భావిస్తున్నారు.
 
ఐతే క్రూర జంతువులు అలా రోడ్లపైకి వచ్చి తిరుగుతున్నప్పుడు వాటికి దూరంగా వుండాలనీ, వాటి ఫోటోలు, వీడియోలు తీసేందుకు సాహసం చేయరాదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు పులివాత పడి పలువురు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు