వరకట్న వేధింపులు.. బలైపోయిన టెక్కీ.. పుట్టింటికి వెళ్లినా వదల్లేదు..

శుక్రవారం, 29 ఏప్రియల్ 2022 (09:49 IST)
Software employee
ఆధునికత పెరిగినా మహిళలపై అకృత్యాలు ఆగట్లేదు. వరకట్న వేధింపులకు తెరపడట్లేదు. తాజాగా వరకట్న వేధింపులకు టెక్కీ బలైపోయింది. కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సిరిసిల్ల పట్టణానికి చెందిన జూపల్లి శ్రీనివాసరావు ప్రైవేటు ఉద్యోగి. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని అయిన పెద్ద కుమార్తె నిఖిత (26)కు సిరిసిల్ల పట్టణానికే చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి చేటి ఉదయ్‌తో గతేడాది జూన్‌ 6న వివాహం జరిపించారు.
 
వివాహ సమయంలో రూ.10 లక్షల నగదు, 35 తులాల బంగారు ఆభరణాలను ఇచ్చారు. శ్రీనివాసరావుకు సొంతూరులో 4.25 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా అందులో సగం భూమిని తన పేరిటగానీ, తన తల్లిదండ్రుల పేరుతో గానీ రాయించాలని నిఖిత భర్త వేధిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
అందుకు శ్రీనివాసరావు సమ్మతించకపోగా తమ మరణానంతరం ఆస్తి చెందుతుందని తెగేసి చెప్పాడు. దీంతో ఉదయ్‌ తనకు అదనపు కట్నం కావాలంటూ భార్యను నిత్యం వేధించేవాడు. దీంతో శ్రీనివాసరావు ఇటీవల అల్లుడికి మరో రూ.10 లక్షలు ఇచ్చారు. అయినా ఉదయ్‌ తీరు మారలేదు. 
 
ఉదయ్ వేధింపులు తాళలేక పుట్టింటికి వచ్చింది. అయినా రోజూ ఫోన్‌లో భార్యను వేధించేవాడు. ఈనెల 20న అత్తగారింటికి వచ్చి గొడవ పడ్డాడు. ఆ సమయంలో భార్య మెడలోని మంగళసూత్రాన్ని తెంపి ఆమెను తీవ్రంగా కొట్టాడు. 
 
దాంతో మనస్తాపం చెందిన నిఖిత బెడ్‌రూంలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. రాత్రి 10 దాటినా తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబీకులు తలుపు బద్దలుకొట్టి చూడగా ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు