తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల ఢిల్లీలో వెలుగు చూసిన మద్యం స్కామ్‌లో తెరాస ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమె నివాసం ఎదుట బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. వీరందరినీ పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
దీనికి నిరసనగా జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం పామ్నూర్‌లో పాదయాత్ర శిబిరం వద్ద బండి సంజయ్ తలపెట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేసి ఆయన్ను అరెస్టు చేశారు. అయితే, బండి సంజయ్‌ను అరెస్టు చేయడాన్ని బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా ప్రతిఘటించారు. ఆయన చుట్టు భద్రతా వలయంగా ఉండటంతో అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు నానా తంటాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
చివరకు పోలీసులు పాదయాత్ర శిబిరం వద్దకు చేరుకుని బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆ తర్వాత బీజేపీ కార్యకర్తల తీవ్ర ప్రతిఘటన మధ్యే ఆయన్ను పోలీసు జీపులోకి ఎక్కించారు. మార్గమధ్యంలో పోలీసులు వాహనాలను బీజేపీ కార్యకర్తలు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీంతో వారిని పోలీసులు బలవంతంగా పక్కకను తొలగించారు. ఈ క్రమంలో పలువురు బీజేపీ కార్యకర్తలు గాయాలు కూడా అయ్యాయి.