గవర్నరుగా మరో బీజేపీ నేత : తెలంగాణా నుంచి ఇద్దరు

గురువారం, 19 అక్టోబరు 2023 (10:58 IST)
భారతీయ జనతా పార్టీకి చెందిన మరో సీనియర్ నేత ఒకరు గవర్నర్‌గా నిమితులయ్యారు. ఆయన పేరు ఇంద్రసేనా రెడ్డి. తెలంగాణ ప్రాంతానికి చెందిన నేత. దీంతో తెలంగాణ నుంచి గవర్నర్లుగా ఇద్దరు నేతలు ఉన్నట్టయింది. ఇప్పటికే బండారు దత్తాత్రేయ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నరుగా పని చేస్తున్నారు. ఇపుడు ఇంద్రసేనా రెడ్డి గవర్నర్ గిరి దొరికింది. ఈయన టీఎస్ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఎంతో అండగా ఉంటూ బీజేపీ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. 
 
ఇంద్రసేనారెడ్డిది సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గంలోని గానుగబండ గ్రామం. ఆయన రాజకీయ ప్రస్థానం ఏబీవీపీతో మొదలైంది. ఏబీవీపీలో ఉమ్మడి ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా ఆయన పని చేశారు. ఆ తర్వాత బీజేవైఎం జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లిన చరిత్ర ఆయనది. 
 
1983లో తొలిసారి మలక్ పేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఇంద్రసేనారెడ్డి గెలుపొందారు. అప్పట్లో హోంమంత్రిగా ఉన్న ప్రభాకర్ రెడ్డిని ఓడించి చరిత్ర సృష్టించారు. అప్పటి నుంచి ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. 1985లో మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావును ఓడించారు. 1999లో మూడోసారి గెలిచి శాసనసభాపక్ష నేతగా వ్యవహరించారు. 2003 నుంచి 2006 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 
 
మరోవైపు ఒడిశా గవర్నర్ గా ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ను నియమించారు. ఇంకోవైపు ఇప్పటికే తెలంగాణకు చెందిన మరో బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ హర్యానా గవర్నర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు